భారత సంతతికి చెందిన మహిళా న్యాయవాది అన్నపూర్ణి ఎస్ శంకరన్... ఉత్తర అమెరికాలోని దక్షిణాసియా న్యాయవాదుల సంఘానికి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. బోస్టన్‌లో ఉంటున్న అన్నపూర్ణి "నార్త్ అమెరికన్ సౌత్ ఆసియన్ బార్ అసోసియేషన్ (ఎన్ఏఎస్ఏబీఏ)" కు అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.2010 వ సంవత్సరం జూలై నెలలో, అధ్యక్షురాలిగా అన్నపూర్ణి బాధ్యతలు చేపడతారనీ... బోస్టన్‌లో జరిగిన వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఎన్ఏఎస్ఏబీఏ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించింది. 2004-07 మధ్యకాలంలో గ్రేటర్ బోస్టన్ దక్షిణాసియా న్యాయవాదుల సంఘానికి అన్నపూర్ణి అధ్యక్షురాలిగా పనిచేశారు. అలాగే, గత రెండు సంవత్సరాలుగా ఎన్ఏఎస్ఏబీఏ కార్యవర్గ కమిటీలో అన్నపూర్ణి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఎన్ఏఎస్ఏబీఏకు అధ్యక్షురాలిగా ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేసిన అన్నపూర్ణి... తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. కాగా... దక్షిణాసియా సంతతికి, న్యాయవాదుల మధ్య సంబంధాల పటిష్టత లక్ష్యంతో ఎన్ఏఎస్ఏబీఏ పనిచేస్తోంది. |