ప్రముఖ ఎన్నారై మహిళ, మఫత్‌లాల్ లగ్జరీ సంస్థ ప్రెసిడెంట్ అయిన శీతల్ మఫత్‌లాల్‌ను నగల అక్రమ రవాణా ఆరోపణలపై ముంబై కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను న్యాయస్థానంలో హాజరుపరచగా, జూన్ 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి న్యాయమూర్తి ఆదేశించారు. దాంతో, బెయిల్ దొరకని కారణంగా శీతల్ జైల్లోనే గడపాల్సి వచ్చింది.కోర్టు విచారణ పూర్తయిన అనంతరం శీతల్‌ను వైద్య పరీక్షల కోసం నేరుగా సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా... శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో బైకుల్లాలోని మహిళా కారాగారానికి తీసుకెళ్లి, రిజిస్టర్‌లో పేరు నమోదు చేయించి, ఆమెకు సంబంధించిన వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.ఆ తరువాత అండర్ ట్రైల్ ఖైదీలను ఉంచే బారక్‌లోకి శీతల్‌ను తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ ఆమె పడుకునేందుకుగానూ ఓ చింకి చాపను ఇచ్చారు. చుట్టూ 50-60 మంది ఖైదీలు, దోమలు, దుర్గంధం కలగలసిన వాతావరణంలో ఆమె గడపాల్సి వచ్చింది. ఇంటి భోజనానికి కూడా కోర్టు అనుమతించకపోవడంతో, ఆమె జైలు భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఎట్టకేలకు మంగళవారం న్యాయస్థానం శీతల్‌కు నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఇంకా కొన్ని లాంఛనాలు పూర్తి చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆమె మంగళవారం కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది. కాగా.. శీతల్‌పై వచ్చిన ఆరోపణలు గనుక వాస్తవాలు అయినట్లయితే, ఆమె 7 సంవత్సరాలపాటు కారాగారశిక్షను అనుభవించాల్సి ఉంటుంది. |