పిల్లల సంరక్షకులకు సరైన వేతనం ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణల నుంచి భారత సంతతి కెనడా మంత్రి రూబీ ధల్లా ఎట్టకేలకు బయటపడ్డారు. ఈ ఆరోపణలపై ఏర్పాటయిన కెనడియన్ పార్లమెంటరీ కమిటీ, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది.గతంలో రూబీ ధల్లా ఇంట్లో పిల్లల సంరక్షకులుగా పనిచేసిన ఫిలిఫైనో నానీస్ తాము శ్రమ దోపిడీకి గురయినట్లు ఆరోపించారు. తక్కువ వేతనం ఇచ్చి, తమచేత ఎక్కువ పని చేయించుకుంటున్నారని, తమ పత్రాలని లాక్కొన్నారని, నానీలు చేయాల్సిన పనులే కాకుండా... కార్లు తుడవడం, బూట్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేయించారని గత నెలలో విమర్శించారు.దీంతో ఈ వ్యవహారంపై అధికారులతో విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వం ఆదేశించింది. కెనడా రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ యువనేతగా మంచి పేరు సంపాదించుకున్న దశలో వచ్చిన ఈ ఆరోపణలు రూబీ ధల్లాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఆరోపణలపై స్పందించిన రూబీ ధల్లా మాట్లాడుతూ... ఉన్నతస్థాయి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేశారని, ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నంలో భాగమే ఇదని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న దురుద్దేశ్యంతోనే ఈ ఆరోపణలు చేయిస్తున్నారంటూ దల్లా మద్ధతుదారులు ఆరోపించారు.పని మానేసిన 15 నెలల అనంతరం పిల్లల సంరక్షకులు నిరాధార, అసత్య ఆరోపణలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని రూబీ ధల్లా వాపోయారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరాలని ఆమె స్పష్టం చేశారు. ప్రవాసులుగా ఇబ్బందులు ఎదుర్కొన్న తాము కనీసం ఒకరిని దోపిడీ చేయాలనే ఆలోచన కూడా చేయమని అన్నారు. యువనేతగా యువత రాజకీయాల్లోకి వచ్చేలా ఆదర్శంగా పనిచేస్తున్న తాను అలాంటి తప్పుడు పనులకు ఎప్పుడూ పూనుకోబోనని రూబీ తేల్చి చెప్పారు. మిస్ కెనడా-భారత్ రన్నరప్ కూడా అయిన రూబీ ధల్లా మాగ్జిమ్ మేగజైన్ జాబితాలో హాటెస్ట్ రాజకీయవేత్తగానూ స్థానం సంపాదించుకున్న సంగతి పాఠకులకు తెలిసిందే. పురుషుల మతులు పోగొట్టే ప్రపంచ రాజకీయ మహిళల జాబితాలో కూడా రూబీ మూడో స్థానంలో నిలిచారు. |