అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ పదవికి భారత సంతతికి చెందిన నమ్రత నిక్కీ రాంధ్వా హలే (37) పోటీపడుతున్నారు. నిక్కీగా పాపులర్ అయిన ఆమె వచ్చే సంవత్సరం జరుగనున్న దక్షిణ కరోలినా గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం నిక్కీ సౌత్ కరోలినా రాష్ట్ర అసెంబ్లీలో సభ్యురాలిగా ఉన్నారు. నిక్కీ గవర్నర్‌గా ఎన్నికయితే ఈ ఘనత సాధించిన రెండో ఇండో అమెరికన్‌గా, తొలి ప్రవాస భారత మహిళగానూ చరిత్ర సృష్టించనున్నారు. కాగా, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ ఆమెకంటే ముందు లూసియానా గవర్నర్‌గా ఎన్నికయిన సంగతి తెలిసిందే.పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ మాట్లాడుతూ... గవర్నర్ పదవికి పోటీలో ఉంటానని ముందే ఊహించాననీ, ఈ పోటీలో తప్పకుండా విజయం సాధిస్తానని అన్నారు. గవర్నర్ పదవికి పోటీ పడుతున్న విషయం తెలియగానే తన భర్త, తల్లిదండ్రులు, పిల్లలు ఎంతగానో ఆనందించారని... ఇక తనకోసం పనిచేసేందుకు బంధువులందరూ సిద్ధంగా ఉన్నారని నిక్కీ సంతోషం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే... ఈమెకు మద్ధతుగా హిల్‌కౌంట్‌లో ఇండియన్ అమెరికన్ రిపబ్లికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమానికి నిక్కీ హాజరయ్యారు. సౌత్ కరోలినా గవర్నర్ శాన్‌ఫోర్డ్‌తో సహా పలువురు రాష్ట్ర నాయకులు నిక్కీ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు.ఇక తన రాజకీయ ప్రవేశం గురించి నిక్కీ మాట్లాడుతూ... ఇండియన్ అమెరికన్ల సమస్యలను తన సమస్యలుగా భావించడం వల్లనే తాను రాజకీయాల్లోకి ప్రవేశించగలిగానని పేర్కొన్నారు. రాజకీయాలలో యువత ప్రాధాన్యం పెరగాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. అమృత్‌సర్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన పంజాబ్ సిక్కు కుటుంబానికి చెందిన నిక్కీ... తాను గవర్నర్‌గా ఎన్నికయితే విద్య, ఉపాధి, వైద్య రంగాలపై ప్రధానంగా దృష్టి పెడతానని చెప్పారు. |