ముస్లిం సమాజానికి అమెరికా ప్రత్యేక దూతగా నియమితురాలైన ఫరా పండిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తన నియామకంపై భారత ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఫరా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒబామా యంత్రాంగంలో చోటు సంపాదించటంపై భారతీయులందరూ తనను అభినందనల్లో ముంచెత్తుతున్నారని ఆమె మీడియాకు వెల్లడించారు.భారత సంతతికి చెందిన వ్యక్తిగా... తనకు లభించిన ఓ ప్రత్యేకమైన గౌరవంగా ఈ పదవిని భావిస్తానని ఫరా పండిత్ పేర్కొన్నారు. కాగా... విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కాశ్మీర్‌కు చెందిన ఫరాను ముస్లిం సమాజానికి అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన సంగతి తెలిసిందే. ముస్లిం దేశాలలో అమెరికా ప్రతిష్టను పెంచేందుకు, ముస్లిం ప్రపంచంతో సరికొత్త బంధాలు ప్రారంభించేందుకు ఒబామా ప్రభుత్వం ఈ పదవిని సృష్టించింది.పుట్టుకతో కాశ్మీరీ అయిన ఫరా పండిత్ అమెరికాలోని మస్సాచుసెట్స్‌లో పెరిగి పెద్దవారయ్యారు. ఆమె విద్యాభ్యాసమంతా అక్కడే పూర్తి చేసుకున్న ఈమె అనేక ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో పనిచేశారు. ఆపై 2003 నుంచి అమెరికా ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో ఈమె విధులు నిర్వహించారు. ఇదిలా ఉంటే... హిల్లరీతో కలిసి తాను భారత్‌కు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదని.. జూలై ద్వితీయార్థం తరువాత హిల్లరీ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఫరా మీడియాకు తెలిపారు. |