ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » ఎన్నారై నిధి సింగ్‌కు స్కాట్‌ల్యాండ్ ఎంపీ బాసట (NRI | Nri Women | Scotland | MP | Pete Wishart | Nidhi Singh | Navjot Singh | Perth | Britain)
 
Women
FILE
స్కాట్‌ల్యాండ్‌లో నివసించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. భారత్‌కు చెందిన వితంతు మహిళ నిధి సింగ్‌కు హోంశాఖ అనుమతి నిరాకరించటం సముచిత నిర్ణయం కాదని స్కాటిష్ ఎంపీ పీట్ విషార్ట్ తప్పుబట్టారు. నిధి సింగ్ వ్యవహారంలో బ్రిటన్ హోంశాఖ తీరును దుయ్యబట్టిన విషార్ట్... పెర్త్ కమ్యూనిటీ అభివృద్ధికి నిధి సింగ్ సేవలు ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. నిధిసింగ్, నవజ్యోత్ సింగ్ దంపతులు గత కొంతకాలంగా స్కాట్‌లాండ్‌లోని పెర్త్ నగరంలో నివసిస్తున్నారు. అయితే గత జనవరి నెలలో నవజ్యోత్ మరణించాడు. దీంతో మృతుడు వర్క్ వీసాపై వలస వచ్చాడనే కారణంతో.. నిధి సింగ్, ఆమె ఇద్దరు సంతానంపై బ్రిటన్ హోంశాఖ అనర్హత వేటు వేసింది. అంతేగాకుండా.. దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నిధి సింగ్ కుటుంబం వెంటనే భారత్‌కు తిరుగుముఖం పట్టింది. ఇమ్మిగ్రేషన్ స్టేటస్ సాధించేందుకు ఆమె భర్త నవజ్యోత్‌పై ఆధారపడిన నిధిసింగ్‌కు మరో పక్షం రోజుల్లో శాశ్వత నివాస హక్కు సంక్రమించి ఉండేది. అయితే భర్త మరణం రూపంలో ఆమెను దురదృష్టం వెంటాడింది.

అయితే.. నిధి సింగ్ ఉదంతంలో హోంశాఖ మానవీయ కోణాన్ని విస్మరించి, బాధితురాలికి అన్యాయం చేసిందని ఎంపీ విషార్ట్ ఆరోపించారు. ఇప్పటికైనా బాధితురాలికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో విషార్ట్ చొరవతో ప్రస్తుతం పూణేలో నివసిస్తున్న నిధి సింగ్ కుటుంబం స్కాట్‌ల్యాండ్‌కు తిరిగి వెళ్లేందుకు చర్యలు వేగవంతమయినట్లేనని చెప్పవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.