అహింస ద్వారా సాధించలేనిది ఏదీ లేదని అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) ప్రజా వ్యవహారాల అధికారి జూలియట్ ఉర్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జర్నలిజం విభాగంలో "అహింసే ఆయుధం" అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శనకు హాజరైన సందర్భంగా ఆమె పై విధంగా స్పందించారు.
డాక్యుమెంటరీ ప్రదర్శన అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఉర్ మాట్లాడుతూ... అమెరికా పోరాట యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ నుంచి నేటి అధ్యక్షుడు బరాక్ ఒబామా దాకా మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్నే అనుసరించారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రజలంతా అహింసను అనుసరించినప్పుడల్లా గాంధీజీనే స్మరించుకుంటారన్నారు.
ఇదిలా ఉంటే.. విశాఖలోనే గాయత్రి విద్యా పరిషత్‌లో నిర్వహించిన ఓ సదస్సులో కూడా జూలియట్ ఉర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అమెరికా రాజకీయాల్లో మహిళల పాత్రపై ఆమె ప్రసంగించారు. దేశ రాజకీయ చరిత్రలో హిల్లరీ క్లింటన్ లాంటి మహిళల పాత్రను ఉర్ వివరించారు.