ప్రత్యేక వార్తలు | ఎన్.ఆర్.ఐ. మహిళలు
ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » న్యూజెర్సీలో పురంధరేశ్వరికి ఘన సన్మానం (NRI Women | Daggubati Purandeswari | Minister | New Jersey | Royal Albert Palace | America | John Colvin)
Feedback Print Bookmark and Share
 
Purandhareswari
FILE
భారత మానవ వనరుల శాఖ సహాయమంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరికి న్యూజెర్సీలో ఘన సన్మానం జరిగింది. రాజకీయాల్లో తనదైన ముద్రతో ముందుకెళ్తున్న ఈ తెలుగింటి ఆడపడచును ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ప్రవాసాంధ్ర సంఘాలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు పురంధరేశ్వరిపై పూలవర్షం కురిపించటం విశేషం.

సుమారు 3 వేల మంది పాల్గొన్న ఈ సన్మాన కార్యక్రమం రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో పురంధరేశ్వరికి స్వాగతం పలికారు. న్యూజెర్సీ గవర్నర్ జాన్ కొల్విన్ చేతులమీదుగా ఆమెను సన్మానించారు.

అనంతరం కొల్విన్ మాట్లాడుతూ.. ఆంధ్రులు అత్యంత ప్రతిభావంతులని, అమెరికాలో వీరు అనేక రంగాల్లో చక్కగా రాణిస్తున్నారని ప్రశంసించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నతమైనవనీ, తెలుగువారు క్రమశిక్షణకు మారుపేరని ఆయన అన్నారు. అంతేగాకుండా తెలుగువారి సంక్షేమంపట్ల తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.

తరువాత సన్మాన గ్రహీత పురంధరేశ్వరి మాట్లాడుతూ... భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, వాటి పవిత్రత గురించి ఆకట్టుకునే రీతిలో, తనదైన శైలిలో ప్రస్తావించారు. వాటన్నింటినీ కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపైనా ఉన్నదనీ ఆమె సూచించారు. అలాగే.. అమెరికాలో ఉంటున్నప్పటికీ ప్రవాసాంధ్రులు అన్ని పండుగలను, ఉత్సవాలను ఆసక్తిగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా నిర్వహించుకోవటం గర్వకారణమని కొనియాడారు.

ఆంధ్రరాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా వరదుల ముంచెత్తి వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ఉదారంగా ముందుకొచ్చి సహాయం అందించాలని ఈ సందర్భంగా పురంధరేశ్వరి ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. తన పర్యటనలో ఇప్పటిదాకా వరద బాధితుల కోసం 70 వేల డాలర్లను విరాళంగా అందుకున్నట్లు ఆమె తెలిపారు. కాగా.. ఇదే కార్యక్రమంలో మరో 60 డాలర్లు సమకూరడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.