ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ఎన్.ఆర్.ఐ. మహిళలు » ప్రతిభా పాటిల్‌కు లండన్‌లో ఘన స్వాగతం (NRI Women | Britan | Sypras | President | Pratibha Patil | London | Queen Elizabeth | Gordon Brown)
బ్రిటన్, సైప్రస్ దేశాలలో వారం రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ సోమవారం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు రాజ కుటుంబీకులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా.. ఈ పర్యటనలో ప్రతిభ బ్రిటన్ రాణి ఎలిజబెత్‌తో భేటీ అవనున్నారు. అలాగే కామన్వెల్త్ క్రీడల దండాన్ని కూడా క్వీన్ ఎలిజబెత్ నుంచి రాష్ట్రపతి స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు సన్నాహక సూచకంగా పాటిల్ దండాన్ని స్వీకరిస్తారు.
ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, వాయు ఉద్గారాల నియంత్రణపై ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాల పురోగతిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పాటిల్.. బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్, విపక్ష నేత డేవిడ్ కేమరూన్ తదితరులను కలుసుకుంటారు. అనంతరం భారత రాష్ట్రపతి గౌరవార్థం ఎలిజబెత్ రాణి ఏర్పాటు చేసే ప్రత్యేక విందునులో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్‌కు బ్రిటన్‌లో నివసిస్తున్న నాథ్‌పురీ, గులాం నూన్ అనే ఇద్దరు భారతీయ ప్రముఖులు తాము వేలంలో కొనుగోలు చేసిన జాతిపిత మహాత్మాగాంధీకి సంబంధించిన కొన్ని ఉత్తరాలు, ఒక ఖాదీ గుడ్డను కానుకగా ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే... గత 20 సంవత్సరాలలో భారత రాష్ట్రపతి ఒకరు బ్రిటన్‌లో పర్యటించటం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. ఇకపోతే.. యూకే పర్యటన అనంతరం రాష్ట్రపతి 29వ తేదీన సైప్రస్ పర్యటనకు బయల్దేరి వెళతారు. ఈ పర్యటనలో ఆమె సైప్రస్ అధ్యక్షుడు డిమిత్రిస్ క్రిస్టోఫియాస్, ఇతర సీనియర్ నేతలను కలుసుకోనున్నారు.