పాటిల్ బ్రిటన్ పర్యటన పూర్తి.. సైప్రస్‌కు ప్రయాణం..!
FILE
మూడు రోజులపాటు బ్రిటన్‌లో పర్యటించిన ప్రతిభా పాటిల్.. తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని, సైప్రస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రతిభ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం ఒలింపిక్ క్రీడల జ్యోతి రిలేలో పాల్గొన్నారు. అలాగే బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్‌తోపాటు అనేకమంది ప్రవాస భారతీయ ప్రముఖులను, మేధావులను రాష్ట్రపతి కలుసుకున్న సంగతి తెలిసిందే..!
ఇదిలా ఉంటే... ప్రపంచ ద్రవ్య వ్యవస్థలో వ్యవస్థాగత సంస్కరణలను తెచ్చే విషయంలో భారత్, బ్రిటన్‌లు కలసికట్టుగా కృషి చేయాలని.. భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఆకాంక్షించారు. బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్‌తో సమావేశం అనంతరం ప్రతిభ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా ఇరు దేశాలూ వ్యూహాత్మక భాగస్వాములై ముందుకు సాగడం అవసరమన్నారు.
అమెరికానే కాకుండా.. యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని ప్రముఖ దేశాలు కూడా ఐటీలో భారత్‌తో భాగస్వాములైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రతిభ గుర్తు చేశారు. బ్రిటన్‌లోకి మరింత ఎక్కువగా భారత ఐటీ నిపుణులను అనుమతించాలని కోరగా.. బ్రౌన్ ఆ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఇదే సందర్భంగా బ్రౌన్ మాట్లాడుతూ... ఐటీ, ఉన్నత విద్య, వ్యాపార రంగాలలో బ్రిటన్, భారత్‌ల మధ్య సహకారం మరింతగా విస్తరించాలన్నదే తమ అభిమతమని అన్నారు. ఇందులో భాగంగా తమ దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పటికే భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాయని బ్రౌన్ పేర్కొన్నారు.