షార్జాలో కార్మికులను పంపిణీ చేసే రెండు కంపెనీలు కార్మికులను మోసం చేసి మూసివేయడంతో వందలాది మంది భారత కార్మికులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఈ కార్మికుల్లో ఆంధ్రులే అధికంగా ఉన్నారు. వీరు ఆ దేశంలో అక్రమంగా నివహిస్తున్నందున ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేయలేకున్నారు. ఒక వేల ఫిర్యాదు చేసి తాము దొరికిపోతే భారత్‌కు పంపేస్తారని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు వీసా కోసం వేలాది రూపాయలు చెల్లించి ఉన్నారు. ఒక కంపెనీలో కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది.
అదే భవనంలో ఉన్న మరో కంపెనీ కూడా 300 మందికి పైగా కార్మికుల్ని మూడు నెలల జీతాన్ని ఎగవేసి మోసపుచ్చడంతో కార్మికులకు పూట గడవడమే దుర్భరంగా ఉంది. ఆ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు గత రెండు నెలలుగా ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడు చూసినా ఆ కార్యాలయం మూసి ఉండటంతో కార్మికులు విసిగి వేసారిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని వేరొకరికి అద్దెకి ఇచ్చేసినట్లు ఆ భవంతి వాచ్‌మేన్ చెబుతుండడం కార్మికుల్లో మరింత దిగాలు కలుగజేస్తోంది. ఇటీవల ఈ కంపెనీల మోసపూరిత సమాచారాన్ని ఆ దేశంలో ఓ ప్రముఖ పత్రిక వెలువడించింది.
|