అమెరికాలోని డల్లాస్ మరియు బోస్టన్‌లోని 600 మంది విద్యార్థులకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) విద్యాప్యాకేజీలను విరాళంగా అందించింది. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (ట్యాన్‌టెక్స్) సౌజన్యంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, రంగుల పెన్సిళ్ళు, ఫోల్డర్లు మరియు గ్లూ స్టిక్కులతో కూడిన విద్యాప్యాకేజీలను డల్లాస్‌లోని ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంతానికి చెందిన అవసరార్థులైన 400 మంది విద్యార్థులు తానా నుంచి అందుకున్నారు.
అలాగే మసాచుసెట్స్‌లోని వోర్కెస్టర్ నగరానికి చెందిన పురాతన పారిశ్రామిక వాడకు చెందిన పేద విద్యార్థులకు 200 విద్యాప్యాకేజీలను తానా మరియు ఫ్రెండ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా అందచేసాయి. ఈ కార్యక్రమంలో వోర్కెస్టర్ నగర మేయర్ శ్రీమతి కొన్‌స్టాంటినా ల్యూక్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తానా మరియు సహచర సంఘాలు చేపట్టిన సేవాకార్యక్రమాల పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసారు.
తానా వార్షిక సేవాకార్యక్రమాల్లో భాగంగా తాము చేపడుతున్న కార్యక్రమాలు అమెరికాలోని పలు ప్రాంతాలలో నివసిస్తున్న పేదవిద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తున్నదని తానా అధ్యక్షులు ప్రభాకర్ చౌదరి కాకర్ల ఈ సందర్భంగా తెలిపారు. బోస్టన్ మరియు డెల్లాస్ ప్రాంతాలకు చెందిన తానా ప్రతినిధులు ప్రజోపయోగ కార్యక్రమాలు విజయవంతం కావడంలో అవిరాళమైన కృషిని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ జన్మభూమితో పాటు తమకు ఆదాయవనరులు కల్పిస్తున్న దేశానికి సైతం సేవ చేయడమే పరమార్ధంగా తానా కార్యకలాపాలును తాము నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ చౌదరి తెలిపారు.
ఈ సందర్భంగా తానా కార్యదర్శి ప్రసాద్ తోటకూర, సంయుక్త కార్యదర్శి రామ్ యలమంచిలి, తానా పూర్వ అధ్యక్షులు నవనీత కృష్ణ గొర్రెపాటి తదితరులు తానా కార్యకలాపాలను గురించి తెలియచేసారు. పరాయి దేశంలో తాము పొందిన ఆదాయాన్ని తిరిగి ఆ దేశానికి చెందిన పేదవారి అభ్యున్నతికి అందచేస్తున్న తానా కార్యవర్గ సేవానిరతిని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రశంసించారు.
|