ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన 50 అద్భుత సంస్థల జాబితాలో భారత్‌కు చెందిన పది సంస్థలు స్థానం దక్కించుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్), టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ అండస్ట్రీస్ సహా పది సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ జాబితాలో తైవాన్‌కు చెందిన కంప్యూటర్ తయారీ సంస్థ ఏసర్ అగ్రస్థానంలో నిలిచింది. కాగా, భెల్, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో 13 సంస్థలకు చోటు దక్కించుకున్న చైనా ముందుండగా, 10 సంస్థలకు స్థానం దక్కించుకున్న దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్, విప్రోలు వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ జాబితాలోకెక్కాయి.
అలాగే భెల్, ఎల్‌అంట్‌టీ, రిలయన్స్ సంస్థలు ఈ జాబితాలో వరుసగా ఇది మూడోసారి కూడా చోటు సంపాదించడం గమనార్హం. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న భారతీయ సంస్థలయిన ఇన్ఫోసిస్ 25వ స్థానంలో, ఐటీసీ 27వ స్థానంలో, ఆటో పరిశ్రమ మహీంద్రా అండ్ మహీంద్రా 34వ స్థానంలో నిలిచాయి.
|