అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి స్వయంకృతమని ఇండియన్ అమెరికన్, లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ విమర్శించారు. అసమర్థ విధానాలు, నాయకత్వ లోపం లాంటి కారణాలతోనే తమ పార్టీ పరాజయం పాలయిందని ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.అధ్యక్ష అభ్యర్థి జాన్ మెక్‌కెయిన్ తన ప్రచారంతో ప్రజలను ఆకట్టుకోలేక పోయారని, అంతేగాకుండా వేరే ఇతర అంశాలు కూడా తమ పార్టీ ఓటమికి దోహదపడ్డాయని జిందాల్ చెప్పారు. ఇప్పటికైనా లోటుపాట్లను బేరీజు వేసుకోకపోతే భవిష్యత్తులో సెనెట్, ప్రతినిధుల సభలో తమ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే సూచనలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.పార్టీ ఓటమికి గల కారణాలను జిందాల్ విశ్లేషిస్తూ... ప్రధానంగా మూడు కారణాల వల్లనే తమ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. ఆర్భాటం, అవినీతి, సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైనందునే తమ పార్టీ ప్రజల తిరస్కారానికి గురైందని.. క్రమశిక్షణ, నిర్వహణ ఖర్చుల తగ్గింపు మాటల్లో తప్ప చేతల్లో లేకపోవడం లాంటి కారణాల వల్ల పార్టీ ఓటమి పాలైందని జిందాల్ అన్నారు.అంతేగాకుండా... ఎన్నికలకు వారం ముందుగా తమ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ ఒకరు అవినీతి కేసులో ఇరుక్కోవడం, సవాళ్లను ఎదుర్కొనేందుకు అవలంభించిన సంప్రదాయ విధానాలు... అన్నీ కలిపి పార్టీ ఓటమికి కారణాలయ్యాయని జిందాల్ పేర్కొన్నారు. తమ బలహీనతలను ప్రచారాస్త్రాలుగా చేసుకున్న డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించిందన్నారు. |