జర్మనీలోని ప్రవాసాంధ్రులు "తెలుగు వెలుగు" ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో ప్రవాసాంధ్రులతో పాటు, స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులంతా ఆనందోత్సాహాల నడుమ పాల్గొన్నారు. స్థానిక భారతీయ రాయబార కార్యాలయ వైస్ కౌన్సిలర్ రఘురామ్ ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రవాసాంధ్రులకు సంక్రాంతి ప్రాధాన్యతను వివరించారు. కృష్ణవంశీ ఆలపించిన ప్రార్థనా గీతంతో వేడుకలు ముందుకు సాగాయి. అనంతరం తెలుగు వెలుగు సంఘం కార్యదర్శి చిలకం జానకి రామరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు.లాస్య ప్రియ ఫైన్ ఆర్ట్ వారి ఆధ్వర్యంలో బాలబాలికలకు భరతనాట్యం, కూచిపూడి, బాలీవుడ్ నృత్య గీతాలలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పై విభాగాలలో పోటీపడిన బాలబాలికల నాట్యప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనేక సాంస్కృతిక కార్యక్రమాల నడుమ సంక్రాంతి వేడుకలు ఘనంగా ముగిశాయి.ఇదిలా ఉంటే... హ్యూస్టన్‌లోని తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మీనాక్షి దేవాలయంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల నుండి విశేష స్పందన లభించింది. ఈ వేడుకల్లో చిన్నారులకు నిర్వహించిన భోగిపళ్ల వేడుక, గంగిరెద్దు సంప్రదాయ ప్రదర్శన తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. |