మెరుపువేగంతో ప్రపంచ అగ్రరాజ్య అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన నల్లజాతి వజ్రం బారక్ హుస్సేన్ ఒబామాకు... భారత జాతిపిత మహాత్మాగాంధీ పరోక్షంగా స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆదేశ పార్లమెంటు సభ్యులే వెల్లడించారు.ఈ విషయమై న్యూయార్క్‌కు చెందిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి గ్రెగరీ మీక్స్, వాషింగ్టన్ ప్రతినిధి జిమ్ మెక్ డెర్మట్ మాట్లాడుతూ... అమెరికాలో పౌర హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ వ్యక్తిత్వం ఒబామాను కదిలించిందనీ చెప్పారు. అయితే లూథర్ కింగ్ జూనియర్ అయిన ఒబామాకు మాత్రం స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది మాత్రం మహాత్ముడేనని వారంటున్నారు.అమెరికాకు ఓ నల్లజాతీయుడు అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి భారతదేశం వహించిన పరోక్ష పాత్ర ఇదేనని మీక్స్, డెర్మెట్‌లు పేర్కొన్నారు. క్యాపిటల్ హిల్‌లో భారతీయ అమెరికన్ ప్రముఖులను ఉద్దేశించి వీరు మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా మంచి పరిణామాలు, సరికొత్త మార్పుల కోసం ఒబామా తపన మొదలైందని.. వాటి ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని అన్నారు.ఒబామా గురించి తల్చుకోగానే మార్టిన్ లూథర్ కింగ్ గుర్తొస్తారనీ... ఆయనను తల్చుకుంటే మహాత్ముడు జ్ఞప్తికి వస్తారని మీక్స్, డెర్మెట్‌లు తమ అభిప్రాయం వెల్లడించారు. ఈ రకంగా అమెరికాకు ఒబామా 44వ అధ్యక్షులు కావడానికి భారత్ ఓ ఆత్మీయబంధాన్ని పెనవేసుకుందని వారు తెలియజేశారు. |