అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామాపై... భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ విమర్శల బాణం ఎక్కుపెట్టారు. కొత్త అధ్యక్షుడు బాధ్యతారాహిత్యంతో కూడిన ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.రిపబ్లిక్ పార్టీ రైజింగ్ స్టార్‌గా పేరుపొందిన జిందాల్, ఒబామా విధానాలపై తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తూ... ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని ముందుకు నడిపించాల్సింది వాషింగ్టన్ నాయకత్వమే అయినప్పటికీ... పన్నులు పెంచటం, ఎక్కువ డబ్బును రాబట్టడం సరైన పద్ధతి కాదని తప్పుబట్టారు.ఒబామా అనుసరిస్తున్న విధానాలు బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పటికీ... కొత్తగా ఏర్పడిన పాలనా యంత్రాంగంతో కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తానని జిందాల్ పేర్కొన్నారు. ఏ విధానాలనైతే వ్యతిరేకిస్తున్నామో, అక్కడ సరైన నిర్ణయాలను సూచించే బాధ్యత తమపై ఉందని రిపబ్లికన్లకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే... అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాంగ్రెస్‌లో చేసిన తొలి ప్రసంగానికి ప్రతిస్పందనగా... రిపబ్లికన్ పార్టీ తరపున జిందాల్ చేసిన అధికారిక ప్రసంగం భారతీయ అమెరికన్లను అంతగా ఆకట్టుకోలేక పోయింది. అంది వచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకున్నారని... ఎప్పట్లాగానే గబగబా మాట్లాడేశారని, ఆయనకు ఎందుకంత తొందరని.. పలువురు భారతీయ అమెరికన్లు జిందాల్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. |