ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా జారీ చేస్తున్న హెచ్1బీ వీసాలకు నిరాదరణ పెరుగుతోంది. ఈ వీసాల దరఖాస్తులను స్వీకరించటం ప్రారంభించి ఇప్పటికి మూడు నెలల కాలం గడచిపోయినా, ఇంకా 20 వేల దరఖాస్తులు మిగిలిపోయాయి. దీంతో ఇంకెంతకాలం వేచి చూడాలో తెలియని అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం అధికారులు అయోమయంలో పడిపోయారు.ఇదిలా ఉంటే... 2009 సంవత్సరానికిగానూ అత్యున్నత సాంకేతిక వృత్తి నైపుణ్యాలున్న 65వేల మంది అభ్యర్థులకు హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా కేవలం 44,800 దరఖాస్తులు మాత్రమే అందగా, ఇంకా 20 వేల దరఖాస్తులు అందాల్సి ఉంది.దీంతో పూర్తి స్థాయిలో దరఖాస్తులు అందేదాకా గడువుతేదీని పొడిగిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలసలశాఖ ప్రకటించింది. కాగా... ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం, అమెరికా అవలంభిస్తున్న రక్షణాత్మక ధోరణులనే ఇందుకు కారణాలుగా ఉంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.గతంలో అయితే, ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే నిర్ణయించిన కోటాకు కొన్ని రెట్లు అధిక సంఖ్యలో దరఖాస్తులు అందేవి. వీటిలో లాటరీ ద్వారా ఎన్నుకున్న అభ్యర్థులకు మాత్రమే వీసాలు లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యింది. వీసాలు ఇస్తాం రండి బాబూ... అంటూ ఆ శాఖ అధికారులు పిలుస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మరి... ఆర్థికమాంద్యమంటే మజాకా ఏంటీ...?? |