దుబాయ్‌లోని ఖతార్ తీరంలో ఓడ బోల్తాపడిన ప్రమాదంలో 16మంది భారతీయులతో సహా 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు భారతీయులతో సహా ఐదుగురిని ఖతార్ తీరగస్తీ దళం రక్షించింది. దోహాకు రెండు నాటికల్ మైళ్ల దూరంలోని ఖతార్ తీరంలో ఈ ప్రమాదం సంభవించింది.
దుబాయ్ డిమస్ మెరిన్‌కు చెందిన ఈ ఓడ ఆయిల్‌రిగ్గుకు సరఫరా కోసం బయలుదేరుతూ మార్గమధ్యంలోనే మునిగిపోయింది. ఈ ఓడను ఖతార్‌కు చెందిన హెబీకే పవర్ క్లీనింగ్ సంస్థ అద్దెకు తీసుకుని నడుపుతోంది. కాగా... ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఓడలో 35 మంది ఉండగా, వారిలో 30 మంది చనిపోగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదిలా ఉంటే... మృతదేహాల జాడ కోసం ప్రయత్నిస్తున్న ఖతార్ తీరగస్తీ దళానికి ఇప్పటిదాకా ఏడు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అయితే ఈ ఏడింటిలోనూ భారతీయుల మృతదేహాలు ఉన్నాయా, లేదా అన్నది తెలియడం లేదు. అయితే.. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, మునిగిపోయిన వారు ప్రాణాలతో ఉంటారన్న ఆశలేదని గస్తీ దళాలు చెప్పాయి. కాగా... ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురిలో.. బాలకృష్ణన్ వేలాయుధన్, జైసన్ వెర్గీస్, ప్రభు చెల్లంలుగా గుర్తించారు. |