భారతీయుల ఆంగ్ల బాష ఉచ్ఛారణ ఇతర విదేశీయుల్లాగే బహు బాగుగా ఉంటుందని తాజా యూకే అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎదుటివారికి అర్థమైనంతవరకు ఏ దేశస్థుడినైనా అతని యాసలోనే ఆంగ్ల భాష మాట్లాడే విధంగా ప్రోత్సహించాల్సి ఉంటుందని ఈ అద్యయనం సిఫార్సు చేసింది.లైసెస్టర్ యూనివర్సిటీ "ఫెస్టివల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్" కార్యక్రమం సందర్భంగా పై అధ్యయన నివేదికను సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా బహుళ జన భాషగా ఇంగ్లీషు ప్రాబల్యం పెరిగిపోతుండటం, స్వదేశంలోకన్నా ప్రపంచంలోనే ఈ భాష మాట్లాడేవారు ఎక్కువ అవుతున్న ప్రస్తుత నేపథ్యంలో... భాష ఉచ్ఛారణ నేర్పడంలో నూతన విధానాల ఆవశ్యకత కూడా ఏర్పడిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.భారతీయులుకానీ, చైనీయులుకానీ లేదా మరో విదేశీయుడెవరైనాగానీ తమ సహజ ఉచ్చారణ (యాస)కు భిన్నంగా బిగదీసుకుపోయి కష్టపడి అసలైన ఇంగ్లీషు ఉచ్చారణలో సంభాషించే అవసరం ఎంతమాత్రం లేదని ఈ అధ్యయనం తెలిపింది. ఎదుటివారి సందేహానికి తావులేని విధంగా, వారికి అర్థమయ్యే రీతిలో భాష ఉచ్ఛారణ ఉంటే సరిపోతుందని.. వారి వారి యాసల్లో వారిని ఆంగ్లం మాట్లాడుకోనివ్వటమే ఉత్తమమని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. |