ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ప్రవాసాంధ్రులకోసం "తానా" వైద్య విభాగం ఏర్పాటు (Special News | Telugu Association of North America | TANA | America | Nris | University)
అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అంతేగాకుండా వివిధ యూనివర్శిటీలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు, బీమా సౌకర్యం లేని వారికి సైతం ఈ వైద్య సహాయం అందించేందుకుగానూ తానా ఈ ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు.. డల్లాస్‌లో జరిగిన తానా కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు తదితర కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ విభాగానికి కన్వీనర్లుగా డాక్టర్ అక్కినేని మణి, డాక్టర్ గుమ్మడి సాగర్‌లను నియమించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ విభాగం ద్వారా రాష్ట్రంలో ఉన్న వివిధ ఆసుపత్రులకు సహాయ సహకారాలను అందించాలని, పేదలకు కూడా వైద్య సహాయం అందేటట్లుగా చూడాలని తానా భావిస్తోంది.
అదే విధంగా అమెరికాలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసం ఏర్పాటు చేసిన "తానా టీం స్క్వేర్" ప్రారంభమై సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఆ శాఖ పనితీరుపై కూడా తానా సమీక్షను నిర్వహించింది. గత సంవత్సర కాలంగా ఆపదలో ఉన్నవారికి, ఆకస్మికంగా మృతి చెందినవారి కుటుంబాలకు లక్షా యాభైవేల డాలర్లను తానా టీం స్క్వేర్ చెల్లించిందని తానా వెల్లడించింది.
అలాగే.. ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాష సులువుగా అర్థం అయ్యేవిధంగా బొమ్మలతో కూడిన పుస్తకాలను ప్రచురించాలని, ఇందుకోసం జంపాల చౌదరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తానా కార్యవర్గ సమావేశంలో నిశ్చయించారు. ఇంకా.. ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం విరివిగా విరాళాలు అందజేయాలని ఆ సంస్థ ప్రవాసాంధ్రులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.