ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » మలేషియాలో హిందూ ఆలయం కూల్చివేత (Special News | Hindu Temple | Malaysia | Mathurai Veeran Temple | Malaysian Indian Congress)
మలేషియాలో పేరుగాంచిన హిందూ దేవాలయం "మధురై వీరన్ ఆలయం" గురువారం కూల్చివేతకు గురయ్యింది. కాగా.. ఈ ఆలయం కూల్చివేత ఘటనపై ప్రతిపక్ష పార్టీపై మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎంఐసీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆ పార్టీ విమర్శించింది.
ఈ విషయమై ఎంఐసీ పార్టీ అధ్యక్షుడు సామివేలు మాట్లాడుతూ.. ఆలయం కూల్చివేతను అడ్డుకోకుండా శేలంగార్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలైన ప్రవాస భారతీయ హిందూ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. దేవాలయం తరలింపునకు సంబంధించి ముస్లిం వర్గీయులు అభ్యంతరాలు వెల్లడించినా శేలంగార్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందన్నారు.
మధురై వీరన్ దేవాలయ ప్రస్తుత దుస్థితికి ప్రతిపక్షమే పూర్తి బాధ్యత వహించాలని సామివేలు డిమాండ్ చేశారు. గత ఏడాది, ఇదే రాష్ట్రంలో మహాకాళి అమ్మన్ ఆలయాన్ని కూల్చివేసిన ఘటనను హిందూ ప్రజానీకం ఇంకా మరువకముందే.. తాజాగా మధురై వీరన్ ఆలయాన్ని కూల్చివేసి వారి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.