ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » లండన్ రైలు ప్రమాదంలో ఆంధ్రుడి మృతి (Special News | London | West Ealing | Railway Station | Vishakhapatnam | Chandrasekhar Babu)
లండన్‌లోని వెస్ట్ ఈలింగ్ రైల్వే స్టేషన్‌లో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు ప్రమాదవశాత్తు రైలుకింద పడి మరణించాడు. వివరాల్లోకి వస్తే... విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామానికి చెందిన గొర్లె చంద్రశేఖర్ బాబు (24) ఇటీవల లండన్‌లో ఎం.ఎస్. పూర్తవటంతో.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం రైల్వేస్టేషన్‌లో బాబు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా కాలుజారి ఫ్లాట్‌ఫాం మీద నుంచి రైలుపట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు అతనిపై దూసుకెళ్లటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం బాబు మృతదేహాన్ని సమీపంలోని ఆక్స్‌బ్రిడ్జి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ విషయమై లండన్ తెలుగు సంఘం కార్యదర్శి కోట మల్లేష్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రశేఖర్ బాబు మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు అన్నిరకాల ప్రయత్నాలను చేస్తున్నట్లు వివరించారు. కాగా.. మృతుడు తన స్నేహితులు భరత్, శ్యామ్‌లతో కలిసి "మన తెలుగు టీవీ"లో ప్రాచుర్యం పొందిన ఓ కార్యక్రమంలో పనిచేస్తున్నట్లు కిషోర్ అనే వ్యక్తి లండన్ తెలుగు సంఘం (తాల్)కు ఈ-మెయిల్ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది.