ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » విద్యార్థుల భద్రత మాదే : కెవిన్ రూడ్ (Special News | Australia | Kevin Rudd | Australian Prime Minister | New Delhi | Fikki | Assocham)
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై భౌతిక దాడులు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆ దేశ ప్రధానమంత్రి కెవిన్ రూడ్ హామీనిచ్చారు. న్యూఢిల్లీలో ఫిక్కీ, అసోచామ్, ఇండస్ట్రీ చాంబర్ ఆఫ్ కామర్స్.. తదితర సంస్థలు తన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు సమావేశంలో రూడ్ పై విధంగా స్పందించారు.
ఇదే సమావేశంలో రూడ్ మాట్లాడుతూ... రాబోయే కాలంలో భారత్-ఆస్ట్రేలియా వ్యాపార సంబంధాలకు భారత విద్యార్థులే వారధులని అన్నారు. అంతర్జాతీయ విద్యార్థులు తమ దేశ అతిథులనీ.. వారికి స్నేహ హస్తాన్ని అందించి, తగిన సహాయ సహకారాలను అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. భారత విద్యార్థులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో హింసను అరికట్టే దిశగా, ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలను ప్రవేశపెట్టింది. వీటిద్వారా పోలీసులకు మరిన్ని అధికారాలను కల్పించింది.
మద్యం మత్తులో హింసకు పాల్పడేవారిని అడ్డుకునేందుకు, క్రమరాహిత్యాన్ని అడ్డుకునేందుకుగానూ ఈ చట్టాలను ప్రవేశపెట్టినట్లు విక్టోరియా పోలీస్, అత్యవసర సేవల మంత్రి బాబ్ కెమెరాన్ తెలిపారని ఏఏపీ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా.. నిర్దేశిత ప్రాంతాల్లో నిరంతర సోదాలు, ఆయుధాలు తనిఖీలు చేసే అధికారాలను ఈ చట్టం పోలీసులకు కల్పిస్తుంది.