ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » వైట్‌హౌస్‌లో తొలిసారిగా "గురునానక్" జయంతి..! (Special News | Diwali | White House | Gurunanak Birth Day | Guru Parakh | Sikhs | Obama | Kristina M.)
ఇటీవల మొట్టమొదటిసారిగా దీపావళి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్న శ్వేతసౌధం... తొలిసారిగా గురునానక్ జయంతిని కన్నులపండువగా జరుపుకుంది. నానక్ జన్మదినమైన "గురుపరఖ్" వేడుకలకు దాదాపు 125 మంది సిక్కులు కోలాహలంగా పాల్గొన్నారు. పురుషులు సంప్రదాయబద్ధమైన తలపాగాలు ధరించగా, మహిళలు పంజాబీ దుస్తులతో కనువిందు చేశారు.
కాగా... అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా ఈ వేడుకలకు హాజరు కాలేదు. అయితే.. వైట్‌హౌస్ పౌర సంబంధాల కార్యాలయం అధిపతి క్రిస్టినా ఎం. చెన్ నేతృత్వంలో ప్రభుత్వాధికారులు ఈ వేడుకలకు హాజరై, సిక్కు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. న్యూయార్క్ గురుద్వారాకు చెందిన సరబ్‌జిత్ సింగ్ "గురుగ్రంథ సాహెబ్" పఠనంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.
సిక్కు కౌన్సిల్ ఆన్ రిలిజియన్ అండ్ ఎడ్యుకేషన్ (స్కోర్) ప్రతినిధులు మాట్లాడుతూ.. వైట్‌హౌస్‌లో తొలిసారిగా గురునానక్ జయంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నిర్మల్ సింగ్ నాగ్‌పురి, సుఖ్‌జీవన్ సింగ్ హార్మోనియం, తబలా ప్రదర్శనలు.. అమెరికన్ సిక్కుల నానక్ గీతాలాపనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.