ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ఆసీస్ జాత్యహంకారులకు సుదీర్ఘ జైలుశిక్ష (Special News | Indian Doctor | Mukesh Hairkerwal | Australian | Racist Attackers | Azzopardi)
ప్రవాస భారతీయ వైద్యుడు ముకేశ్ హేకర్‌వాల్‌పై దాడికి పాల్పడ్డ ముగ్గురు ఆస్ట్రేలియన్ జాత్యహంకారులకు సుదీర్ఘ జైలుశిక్షను విధిస్తూ.. విక్టోరియా స్టేట్ కౌంటీ కోర్టు తీర్పునిచ్చింది. ముకేశ్‌ను బేస్‌బాల్ బ్యాటుతో తీవ్రంగా గాయపరచిన అల్ఫర్ అజోపార్డీకి పద్దెనిమిదిన్నర ఏళ్లు, దాడిలో పాల్గొన్న అతడి సహచరులు మైకేల్ బాల్టాట్జిస్‌కు పదహారున్నరేళ్లు, సీన్ గాబ్రియెల్‌కు తొమ్మిదేళ్ల తొమ్మిది నెలల జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి జో గుల్లాసీ తీర్పునిచ్చారు.
అజోపార్డీకి పదమూడున్నరేళ్లదాకా, బాల్టాట్జిస్‌కు పదిన్నరేళ్ల వరకు, గాబ్రియల్‌కు ఆరేళ్లదాకా పెరోల్ పొందే అర్హత ఉండబోదని న్యాయమూర్తి గుల్లాసీ తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి దాడులు నీచమైనవనీ, పిరికిపంద చర్యలని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే... గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన డాక్టర్ హేకర్‌వాల్‌పై పై ముగ్గురు నిందితులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో హేకర్‌వాల్ కపాలం చిట్లిపోగా.. నెల రోజులకు పైగా కోమాలో ఉంచి, చికిత్స అందజేశారు. కాగా.. డాక్టర్‌పై దాడికి పాల్పడక ముందు నిందితులు రెండు నెలల కాలంలో 23 దోపిడీలు చేశారు. వీరు ఎక్కువగా భారతీయులు, ఆసియన్ దేశాలకు చెందినవారిపై దాడిచేసి దోచుకుని పబ్బం గడిపేవారు.