భారత్‌కు 21వ సెంచరీ రాజకీయాలు కావాలి: డాక్టర్ జేపీ
WD
WD
21వ శతాబ్దిలో ఉన్న భారత్‌కు 21వ శతాబ్దపు రాజకీయాలు కావాలని లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 15వ తేదీన చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో జేపీ పాల్గొని ప్రసంగించారు. తమ లక్ష్య సాధన కోసం ఎవరితోనైనా చేయి కలిపి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. భారత్‌లో ఏదోరకమైన మార్పు తప్పనిసరిగా వస్తుందన్నారు. ఈ మార్పును త్వరితగతిన తేవటమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.
రాజకీయ, పాలనా, ఎన్నికల, వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ద్వారా మార్పు సాధించడానికి కావలసిన మానవవనరులు, సాంకేతిక పరిజ్ఞానం మనకు పుష్కలంగా ఉన్నాయన్నారు. భారత్‌లో ఎన్నికలంటే ఒక వ్యాపారంలా, ట్వంటీ-20 క్రికెట్‌లా మారిపోయాయన్నారు. ఎవరో హీరో వచ్చి మారుస్తారని ఆశించకుండా సరైన రాజకీయ వ్యవస్థల్ని నిర్మించేందుకు అందరూ కలిసి వస్తేనే పరిస్థితి మారుతుందన్నారు. ఇందుకు అవసరమైన లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించుకునే పూర్తి అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయన్నారు.
ప్రజల్లో చైతన్యాన్ని పెంచే కృషిలో ఎన్నారైలు కలిసి రావాలన్నారు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నానాటికీ నాసికరంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనకన్నా వెనుకబడి ఉన్న దేశంలోకూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రాథమిక, పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. సాంకేతికాభివృద్ధికి దోహదం చేసే విద్యను గణనీయంగా వృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు.
ఇప్పటికే ఒక పారిశ్రామిక విప్లవాన్ని కోల్పోయాం. అటువంటి అవకాశాన్ని మరోసారి జారవిడుచుకుంటే దేశం భారీ మూల్యం
WD
WD
చెల్లించుకోక తప్పదని జేపీ హెచ్చరించారు. ఇకపోతే.. చికాగోలోని భారత రాయబార కార్యాలయ పనితీరు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇది మన దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదర్శమన్నారు. మన దేశంలో నిజాయితీ రాజకీయాలకన్నా అవినీతి రాజకీయాలకు ప్రోత్సాహకరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితి మారాలన్నారు.
ప్రపంచంలోని అనేక నగరాలు అవినీతి జాఢ్యంలో నలిగి పోయినవేనని, అయితే దృఢ సంకల్పంతో పోరాడి అవినీతి ప్రక్షాళన సాధించాయని ఈ వేళ భారత్‌లో కూడా ఆ బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. అలాగే మనదేశం మరింతగా అభివృద్ధి సాధించాలంటే సంస్కరణలు ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా, విద్య, ఆరోగ్య రంగాలు అత్యంత కీలకమన్నారు.
భారత్ 21వ శతాబ్దపు అభివృద్ధిని సాధించేందుకు సిద్ధంగా ఉంది, అయితే దేశంలో 19వ శతాబ్దపు రాజకీయాలే కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు 21వ శతాబ్దపు రాజకీయాలు ఎంతో అవసరమన్నారు. అమెరికాలో నివశిస్తున్న ఎంతోమంది మేధావులు, ప్రతిభావంతులైన యువత తిరిగి తమ మాతృదేశానికి వచ్చి దేశాభివృద్ధికి అవసరమైన సంస్కరణలకు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులు, లోక్‌సత్తా నేతలు, పీపుల్ ఫర్ లోక్‌సత్తా నేతలు తదితరులు పాల్గొన్నారు.