భారత్‌కు నూతనోత్తేజం పేరుతో "పీపుల్ ఫర్ లోక్ సత్తా" సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా అమెరికాలోని వివిధ నగరాల్లో గత కొన్ని వారాలుగా విస్తృతంగా పర్యటిస్తున్న లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్‌కు కాలిఫోర్నియా బే ఏరియాలో ప్రవాస భారతీయుల నుంచి విశేష స్పందన లభించింది. మే 19 నుంచి 23 వరకూ ఈ ప్రాంతంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
అంతకుముందు లాస్ ఏంజిల్స్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ, గూగుల్ హెడ్ క్వార్టర్స్‌లో జేపీ వివిధ సమావేశాల్లో ప్రసంగించడంతోపాటు ఎన్నారైల ప్రశ్నలకు జవాబులిస్తూ భారతదేశ పునరుజ్జీవనంలో వారిని నిర్మాణాత్మక భాగస్వాములు కావాలని కోరారు. ప్రతిచోటా ఆయన ప్రసంగాలకు మంచి స్పందన లభించింది.
మే 23న సన్నీవేల్ హిందూ దేవాలయం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో వేయిమందికి పైగా హాజరయ్యారు. తమ మాతృదేశాన్ని బాగుచేసి సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రవాస భారతీయులు పడుతున్న తపన తనకెంతో స్ఫూర్తినిస్తోందని జేపీ పేర్కొన్నారు.
భారతీయ రాజకీయాల తీరు పట్ల అందరిలో నిస్పృహ, నిస్సహాయత ఆవరించి ఉన్నదని, అయితే మార్పు రావాలంటే వెంటనే కార్యాచరణకు పూనుకోవడం, మార్పుకోసం కృషి చేస్తున్న శక్తులకు సంపూర్ణ సహకారం అందించటమే మార్గమని స్పష్టం చేశారు. భారత్‌లో మార్పుకోసం తమ వంతు సహకారాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎన్నారైలు కరతాళధ్వనులతో జేపీకి హామీ ఇచ్చారు.
WD
భారతదేశంలో వివిధ సమస్యలు, అంశాలపై లోక్‌సత్తా ప్రణాళికలు తదితరాలపై ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు జేపీ వివరంగా బదులిచ్చారు. లోక్‌సత్తా పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ... భారత్‌లో ఇప్పటివరకూ 5 రాష్ట్రాలలో పార్టీ శాఖలున్నాయన్నారు.
ప్రస్తుత రాజకీయాల తీరు పట్ల అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, సరైన ప్రత్యామ్నాయ రాజకీయ నాయకులకోసం వారు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్ సత్తాకు సారథ్యం వహిస్తున్నవారు మాతృదేశానికి సేవ చేసేందుకు తిరిగి వచ్చిన ఎన్నారైలేనని తెలిపారు.