ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగనున్న భారత్: జేపీ (India | world | economies | Atlanta | Texas | Dr. Jayaprakash Narayan | President | LokSatta Party | VijayAnand | Tamilnadu | Anti Corruption | GDP |)
వచ్చే 2039 నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశం ఎదుగుతుందని లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఎన్ఆర్ఐలు నిర్వహించిన "రెజువెనేట్ ఇండియా" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం గత నెల 28 నుంచి 31 వరకు అమెరికాలోని పలు ప్రాంతాల్లో జరిగింది.
ఈ సందర్భంగా మే 28, 29వ తేదీల్లో అట్లాంటాలో జరిగన కార్యక్రమంలో స్థానిక ఎన్ఆర్ఐలతో జయప్రకాష్ ముచ్చటించారు. రానున్న 2039 నాటికి దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 15 నుంచి 18 శాతానికి చేరుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశం తర్వాతే చైనా ఉంటుందన్నారు. 63 సంవత్సరాల క్రితం భారతదేశపు జీడీపీ వృద్ధి రేటు 2 శాతంగా ఉన్నదని, అప్పటి నుంచి ఇప్పటికి కూడా నత్తనడకన సాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో సానుకూలతలను పెంపొందించి ప్రజలకు ఆర్థికంగా, అధికారపరంగా సమానత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రెండు రోజులపాటు అట్లాంటాలో జరిగిన కార్యక్రమానికి రాంగోపాల్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విజయ్ మాట్లాడుతూ లోక్‌సత్తా పార్టీ ప్రజల్లో సానుకూలత దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. దీంతోపాటు లంచాలను అరికట్టేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో వచ్చే 2016 నాటికి తమ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మనమందరం కలిసికట్టుగా పార్టీ కోసం శ్రమిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మే 30న డల్లాస్, టెక్సాస్‌లలో జరిగిన సమావేశంలో జేపీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖండాంతరాల్లోనున్న భారతీయులు తమదేశ ఉనికికోసం పోరాడాలన్నారు. ఎన్ఆర్ఐలు ప్రాంతీయతత్వం, భాషాభేదం, ధర్మం, మత భేదాలను విస్మరించి దేశంకోసం ఒక్కటిగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో పారిశ్రామిక విప్లవాన్ని తెచ్చేందుకు ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. లంచగొండితనాన్ని నిర్మూలించడం, పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనా విదేశీ విధానం, రాజకీయాల్లో మహిళలు, తెలంగాణ అంశాలపై ఆయన కూలంకషంగా చర్చించారు.
WD
మే 31న హోస్టన్, టెక్సాస్‌లలో జరిగిన సమావేశాల్లో జయప్రకాశ్ నారాయణ్ పాల్గొని ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారన్నారు. డబ్బులు ఖర్చుపెట్టకుండా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త శకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి సాంకేతిక మార్పులు అవసరమన్నారు. భారతదేశంలోని ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు వారికి సరైన విద్య, మంచి ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
దేశంలోని పౌరులు మౌనంగా ఉంటే ఉగ్రవాదులు, మావోయిస్టులు, రాజకీయ నాయకులకన్నా అత్యంత ప్రమాదకరంగా తయారవుతారని విజయ్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టేంతవరకు లోక్‌సత్తా తిరుగులేని పోరాటాన్ని కొనసాగిస్తుందని సభలో పాల్గొన్న హోస్టన్ చాప్టర్ అధ్యక్షుడు హైమా ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమాలకు రాఘవ సోలిపురం సంధానకర్తగా వ్యవహరించారు.