ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ఎన్నారైలకు ఓటింగ్ హక్కు కల్పించండి: పీఎఫ్ఎల్ డిమాండ్ (America | NRI | NRI Voting Rights Petetion | Jayaprakash Narayan)
ఎన్నారైలకు ఓటింగ్ హక్కు కల్పించండి: పీఎఫ్ఎల్ డిమాండ్
WD
అమెరికాలో విజయవంతంగా పూర్తి చేసుకున్న తన పర్యటన అనంతరం లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అమెరికాలో ఉన్న పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా(పీఎఫ్ఎల్) భారతీయులకు విధివిధానాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా అమెరికాలోని పీఎఫ్ఎల్ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో భాగంగా లోక్‌సత్తా పార్టీకి మద్దతునిచ్చే భారతీయులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
అమెరికాలోని వివిధ నగరాల్లో జరుపుకున్న 64వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చాలామంది భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో యువతరానికి చెందిన వారు ఎక్కువగా హాజరు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా వీరిలో స్త్రీలు సైతం పురుషులతో సమానంగా లోక్‌సత్తా, పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా కార్యకలాపాలపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల పిటిషన్‌ను సమర్ధిస్తూ, సంతంకం చేశారు.
ఎన్‌ఆర్ఐ ఓటింగ్ హక్కుల కోసం సంతక సేకరణ కార్యక్రమాన్ని హౌస్టన్ అధ్యక్షురాలు హైమా సగి, పవన్ మరియు ఇతర బృంద సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైమా ప్రసగింస్తూ ఎన్‌ఆర్ఐ ఓటింగ్ హక్కుల కోసం మొట్టమొదటిసారిగా పోరాటం చేస్తున్నది పీపుల్ ఫర్ లోక్‌సత్తా, డాక్టర్ జయప్రకాష్ నారాయణ్‌లేనని అన్నారు.
త్వరలోనే ఈ ఉద్యమాన్ని పీపుల్ ఫర్ లోక్‌సత్తా ప్రజల్లోకి తీసుకు వెళ్లనుందని, ఈ బిల్లును సంబంధింత అధికారుల ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఆమె తెలిపారు. అంతే కాకుండా పీపుల్ ఫర్ లోక్‌సత్తా "ఎంపీలకు పిలుపు" (కాల్ ఫర్ ఎంపీస్) అనే కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంటులో ఎన్‌ఆర్ఐ ఓటింగ్ హక్కు బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు సభ్యులను కోరనున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు.
లాస్‌ఏంజిల్స్ పీపుల్ ఫర్ లోక్‌సత్తా పార్టీ కో-ఆర్డినేటర్ సుబాష్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో నాయకులు ఎన్నో త్యాగాలను చేశారని, కానీ భారత్‌లో సగానికి పైగా ప్రజలు ఇంకా పేదరికం, దారిద్ర్యం నుంచి స్వాతంత్ర్యం పొందలేదని అన్నారు. "ఎన్ఆర్ఐలైన మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి ఎందరో నాయకులు మొదటి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.
ఇక మనవంతు(ఎన్ఆర్ఐ) వచ్చింది, ప్రారంభ దశలో భాగంగా ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కులు సాధించుకోవాలని సుభాష్ పిలుపునిచ్చారు. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ "లోక్‌సత్తా రెండవ స్వాతంత్ర్య ఉద్యమం"లో పాల్గొనాలని పీపుల్ ఫర్ లోక్‌సత్తా పేర్కొంది. ఇప్పటికే ఎన్నారైలు అధిక సంఖ్యలో లోక్‌సత్తాలో చేరడానికి ముందుకొచ్చి ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల బిల్లుపై సంతంకం చేశారు.
బోస్టన్ నుంచి మానస మహంతి మాట్లాడుతూ "మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ, స్త్రీ అర్ధరాత్రి ధైర్యంగా నడిచి వెళ్లినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్టు అని అన్నారు. ఈ లెక్కన మనకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కాబట్టి భారతదేశంలో మనం కొన్ని కొన్ని అంశాలపై పోరాటం చేయాల్సి ఉంది." అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో చాలామంది ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల బిల్లుపై సంతంకం చేశారు. అలాగే లోక్‌సత్తా పార్టీలో సభ్యులుగా చేరడానికి ముందుకొచ్చారు.
న్యూజెర్సీలో కె. రామానాయుడు, డల్లాస్‌లో అనంత్ మల్లవరపు, ఫ్లోరిడాలో విమలతోపాటు వారి బృంద సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను వీడియోల ద్వారా ప్రదర్శించారు. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల బిల్లుకు మద్దతివ్వాలని పీపుల్ ఫర్ లోక్‌సత్తా కోరింది.