ఇప్పటికే ఇంటర్నెట్ పుణ్యమా అని చాలామంది ఉత్తరాలు రాసుకునే కళకు దూరమయ్యారు. నెట్ సర్ఫింగ్, మూడు ముక్కలాటలాగా ముచ్చటగా మూడు ముక్కలతో చాటింగ్ చేసుకుని ప్రేమలు ఒలకబోసుకోవడం వచ్చాక ఉత్తరాల ద్వారా భావప్రసారం మాయమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అనుమానం ప్రబలుతోంది.
చేతిలో మొబైల్, నెట్‌లో సర్ఫింగ్, చాటింగ్ జోరుతో ప్రస్తుత తరం, ఇన్నాళ్లుగా హృదయానుభూతులను పంచుకోవడానికి మనుషులకు అందిన ఉత్తరాల వారసత్వానికి పూర్తిగా దూరం దూరమవుతోంది. ఇప్పుడు కొత్తగా గ్రీటింగ్ కార్డులు కూడా తామున్నామంటూ వచ్చేశాయి. నమ్మండి నమ్మకపోండి భారత దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ గ్రీటింగ్ కార్డుల వ్యాపారం వందల కోట్ల స్థాయిలో నడుస్తోంది.
అబ్బాయి, అమ్మాయిలలో ఏ ఒక్కరు ఇంటర్‌తో ఫెయిల్ అయ్యినా, ప్రేమకు జలుబు చేస్తుంది. మాట పెగలడం కష్టమవుతుంది. ఎంసెట్‌లు, పేసీట్ల పుణ్యమాని యువ ప్రేమికులు విడిపోతారు. ఒక్కొక్కరు ఒక్కో వూళ్ళో హాస్టళ్ళలో చేరిపోతారు. వెళ్ళే ముందు వాగ్దానాలు చేసుకుంటారు. మొదట్లో టెలీఫోన్లు, ఉత్తరాలు నడుస్తాయి.
తర్వాత ఫోన్లు పోయి, ఉత్తరాలు నడుస్తాయి. తర్వాత ఉత్తరాలు పోయి గ్రీటింగ్ కార్డులు మిగులుతాయి. కొంత కాలానికి అవీ పోతాయి. ఇద్దరూ వేర్వేరు అక్షరాలతో 'ఐ లవ్‌యూ' మొదలుపెట్టొచ్చు. ఇదీ ప్రస్తుత తరం జీవనశైలి.. ప్రస్తుతానికి ఉత్తరాల హవా కనుమరుగైపోయినా తమ ఆశల, ఊహల, ఊసుల, ప్రేమల వ్యక్తీకరణకు గ్రీటింగ్ కార్డులే ప్రధాన వాహికగా ఉంటున్నాయి.
గ్రీటింగ్ కార్డుల ప్రభావం ఎంత తారాస్థాయికి చేరుకుందంటే అవి లేని వెబ్‌సైట్ స్వదేశీ, విదేశీ భాషల్లో లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఇంగ్లీష్ భాష మాత్రమే రాజ్యమేలిన గ్రీటింగ్ కార్డుల్లో లోకలైజైషన్ పుణ్యమా అని స్థానిక భాషల శీర్షికలతో, కవితా వాక్యాలతో ఇవి అలరారుతున్నాయి. బిజినెస్‌కు బిజినెస్, ఆకర్షణకు ఆకర్షణ మేలు కలయికతో ఇవి యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది గ్రీటింగ్ కార్డుల కాలం...
|