ప్రేమించడం గొప్పకాదు... ఆ ప్రేమను కలకాలం నిలబెట్టుకోవడమే గొప్ప అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే ప్రేమ ఎంతటి మధురమైన భావనో అది విఫలమైతే అంతటి శాపంగా పరిణమిస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రేమించిన వారిని దక్కించుకోవడమే కాదు వారి సమక్షంలో జీవితాన్ని సంతోషంగా గడపగలగడమే గొప్ప. మరి ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించేకంటే... ఆచరించడానికి ప్రయత్నిస్తే ప్రేమను నిలబెట్టుకోవడం మరీ అంత కష్టమేమీ కాదని చెప్పవచ్చు. ఓ అమ్మాయి మీద అబ్బాయికి, ఓ అబ్బాయి మీద అమ్మాయికి ప్రేమ కలిగినపుడు ఆ విషయాన్ని ఎదుటివారికి చెప్పి వారిలోనూ ప్రేమను పుట్టించి చివరకు వారిని తమవారిగా చేసుకునే వరకు కనిపించే ఆతృత, ఆరాటం వర్ణించడానికి వీలుకాదు. ఎదుటివారి వద్ద తమ ప్రేమను వ్యక్తీకరించిన క్షణంనుంచి వారిలోనూ ప్రేమభావం పుట్టేవరకు మనిషి పడే ఆరాటం అంతా ఇంతాకాదు. ఇలా మనిషి పడే ఆరాటం తనమీద ఎదుటివారిలోనూ ప్రేమ ప్రారంభమై ప్రేమికులుగా కొత్త అవతారం ఎత్తిన తర్వాత కాలం గడిచేకొద్దీ అంతకుముందు ఉన్న ఆసక్తి, ఆవేశం తగ్గుతూ వస్తుంది. అయితే ఈ ఆసక్తి తగ్గడం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఎదుటివారు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు కదా అన్న నిశ్చింతవల్ల వచ్చే ఉదాసీనత కొందరిదైతే, ఎదుటివారూ మనల్ని ప్రేమించేశారు కదా అన్న ధైర్యం కొద్దీ వచ్చే ఉదాసీనత మరికొందరిది. |