1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

ప్రేయసి మదిని తెలుసుకోండి

ప్రేయసి మది భావం తెల్సుకోండి
ప్రేమలో పడ్డామని గొప్పగా చెప్పుకోగానే సరిపోదు. ఆ ప్రేమను పదికాలాలపాటు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించగలగాలి. అప్పుడే మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ ప్రియురాలికి మీరంటే చెప్పలేనంత ఆకర్షణ, ఆత్మీయత ఏర్పడుతాయి. అలాంటి ఆకర్షణ, ఆత్మీయత ఒక్కసారి కలిగిందంటే చాలు మీ ప్రేమను ఏ అడ్డంకి విడదీయలేందు.

అందుకే ప్రేమించడంతో పాటు ఆ ప్రేమను కాపాడుకోవడానికి కూడా ప్రేమికులు తప్పక ప్రయత్నించాలి. ప్రేమను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే సందేహం మీకు కల్గవచ్చు. ప్రేమను కాపాడుకోవడానికి పెద్ద పెద్ద సాహసాలేం చేయాల్సిన పనిలేదు. మీ ప్రేయసికి ఇష్టమైన విషయాలను తెల్సుకోవడం, ఆమె అభిరుచులు, ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోవడం లాంటివి చేయాలి.

అందుకు అనుగుణంగా ఆమె మూడ్‌ను, ఆమె ఇష్టా ఇష్టాలను తెల్సుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించగలగాలి. అలా మీరు ప్రవర్తించగల్గితే మీమీద మీ ప్రేయసి ఎక్కడలేని ప్రేమ ఉప్పొంగుతుంది. చాలామంది అబ్బాయిలు తమ ప్రేమను అమ్మాయి ఒప్పుకుందంటే చాలు ఇక తమ గురించి వారి వద్ద లేనిపోని గొప్పలు చెప్పేస్తుంటారు.


ఇలా తమ గురించి కాస్తో కూస్తో గొప్పలు చెప్పుకోవడం తప్పుకాకపోవచ్చు. కానీ ఈ గొప్పలు చెప్పుకోవడం హద్దు దాటి ప్రేయసి తరుపువారి గురించి కాస్త హేళనగా మాట్లాడేవరకు దారితీస్తుంది. దీంతో అంతవరకు మీరు చెప్పే గొప్పలు విన్న మీ ప్రేయసికి మీపై హఠాత్తుగా కోపం రావచ్చు. ఎందుకంటే ఎవరికైనా తనవారు అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలాంటివారిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వారి మనసు అంగీకరించదు.

ఈ విషయంలో జీవిత భాగస్వామికి సైతం ఎలాంటి మినహాయింపు లేదు. చాలావరకు ఆడవారు తమ గురించి ఓ మాట అన్నా బాధపడరు గానీ తమ తల్లితండ్రులు, పుట్టింటివారి గురించి ఏమన్నా ఊరుకోరు. ఈ విషయంలో ఆడవారే కాదు మగవారైనా అంతే. అయితే ఈ విషయం పట్టించుకోకుండా చాలామంది తమ ప్రేయసి వారి కుటుంబం గురించి చెప్తున్నప్పుడు వాటిని విని ఊరుకోక కాస్త హేళనగా మాట్లాడుతారు.

ఇలాంటి సమయంలో వారికి తప్పకుండా కోపం రావడం సహజం. అందుకే ప్రేమను పదికాలాల పాటు కాపాడుకోవాలంటే ప్రేయసినే కాదు ఆమె ఇష్టా ఇష్టాలను, అభిరుచులను, ఆవేశాలను, ఆనందాలను, బాధలను కూడా తమవిగా ప్రియుడు భావించగలగాలి. అప్పుడే వారిద్దరి ప్రేమ పదికాలాల పాటు స్థిరంగా కొనసాగుతుంది.
About Writer
Munibabu