ఇరు హృదయాల మధ్య ప్రేమ అనే బంధం చిగురించిన తర్వాత ఇక తమ మధ్య ఎలాంటి గొడవలు, అపార్ధాలు రాకుండా కాలమంతా హాయిగా, సంతోషంగా సాగిపోవాలని ప్రతి ప్రేమ జంటా కోరుకుంటుంది. అయితే అన్ని రోజులూ అందంగానూ, ఆనందంగానూ సాగిపోతే ఇక మజా ఏముంటుంది చెప్పండీ...? అందుకే కాబోలు ప్రేమ బంధంలోనూ అప్పుడప్పుడూ చిన్న చిన్న గిల్లికజ్జాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే మిగిలిన బంధాల్లో ఎలా ఉన్నా ప్రేమ బంధంలో మాత్రం చిన్న చిన్న గొడవలు సైతం ఒక్కోసారి అందమైన, అద్భుతమైన జ్ఞాపకాలుగా మిలిగిపోతుంటాయి. అయితే గొడవ సైతం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే తమ మధ్య ఏర్పడిన గొడవ చినికి చినికి గాలివానగా మారకుండా చూచుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రేమికులదే. అలా గొడవను సైతం పెద్దది కాకుండా చూచుకోవాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు తప్పవు మరి. అసలు ప్రేమలో గొడవలు అనేవి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. సీరియస్ గొడవలు, చిలిపి గొడవలు. సీరియస్ గొడవల గురించి కాసేపు పక్కనపెడితే చిలిపి గొడవలు మాత్రం ప్రేమికుల మధ్య తరచుగా తలెత్తుతూనే ఉంటాయి. పిలిచిన సమయానికి రాలేదనో, చాలా రోజులుగా మంచి గిఫ్టు ఇవ్వలేదనో, ముందులా ప్రేమగా మాట్లాడడం లేదనో, తనకోసం సమయాన్ని కేటాయించడం లేదనో, తనకు సంబంధించిన విషయాల్ని తరచుగా మర్చిపోతున్నారనో ప్రేమికులు ఒకరిపై ఒకరు గొడవకు దిగడం సర్వసాధారణం. |