హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్ళ నేపథ్యంలో ఈ దఫా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనున్నాయి. దివ్యక్షేత్రం మొత్తం సిసి కెమెరాలతో నిఘాను పటిష్టం చేయనున్నారు. అలిపిరి నుంచి తిరుమల ఘాట్ రోడ్ పొడవునా బాంబ్ స్క్వాడ్‌లు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. అంతేకాకుండా.. తిరుమల మొత్తాన్ని భద్రతా వలయంలోకి తీసుకరానున్నారు.
ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుక తితిదే పాలక మండలి అన్ని చర్యలు చేపడుతోంది. విద్యుత్ దీప తోరణాలతో, పుష్పాలంకరణలతో తిరుమలను సర్వాంగ సుందరంగా ఇప్పటి నుంచే తీర్చి దిద్దుతున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కల్పించే భద్రత ఇదే..
* శ్రీవారి బ్రహ్మోత్సవాలను 40 బాంబు డిస్పోజబుల్ స్వ్కాడ్ బృందాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తాయి. * అలిపిరి ప్రధాన ద్వారం నుంచి ఘాట్ రోడ్ పొడవునా ప్రత్యే నిఘాను ఏర్పాటు చేస్తారు. * చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి దాదాపు మూడు వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. * ఏడు గిరుల ప్రాంతమంతా.. హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు. శ్రీవారి ఉత్సవాల విధుల్లో పాల్గొనే అర్చకులు, ఇతర సిబ్బంది ఆయా విభాగాల నుంచి ముందస్తు అనుమతి పత్రంతో పాటు గుర్తింపు కార్డు పొందడం తప్పని సరి. * టీటీడికి చెందిన వెయ్యి మంది సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు.
|