శనివారం ప్రారంభం కానున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాల్గొననున్న సందర్భంగా తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తిరుమలకు వెళ్ళే రెండు ఘాట్ రోడ్లలో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మొహరించారు.
అంతేకాకుండా సమీపంలోని అటవీ ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతికి చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్తారు.
తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్ల పల్లిలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల పరిశోధన కేంద్రం భవనాన్ని ముఖ్య మంత్రి శనివారం ప్రారంభిస్తారు. బైరాగి పట్టెడ, అర్బన్ హాట్‌ల వద్ద కొత్తగా నిర్మించిన భవనాలను వైఎస్సార్ ప్రారంభిస్తారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తిరుమలలో నిరంతరాయంగా తనిఖీలను కొనసాగిస్తున్నారు.
|