ఇక రెండో రోజు పగలు స్వామిని "చిన్నశేష" వాహనంపై నాలుగు వేదాలకు చిహ్నాలైన నాలుగు మాడ వీథుల్లో వేడుకగా ఊరేగింపు జేస్తారు. ఈ రెండు "శేష" వాహనాల ఎంపిక తన సన్నిహిత అనుచరుడు, తల్పరూపుడు అయిన ఆదిశేషుని పట్ల శ్రీవారికి ఎంతటి ప్రేమాభిమానాలున్నాయన్న సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అదే రోజున రాత్రి ఉత్సవంగా స్వామివారిని చదువుల తల్లి సరస్వతీదేవి అవతారంలో విశిష్ట వివేక జీవి అయిన "హంస" వాహనంపై విహరింజేస్తారు.
వైభవంగా శ్రీవారి ధ్వజారోహణ
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొలిసారిగా ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ధ్వజారోహణం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. స్వామివారి బ్రహ్మోత్సవాల అంకురార్పణకు శుభ సూచకంగా ఆలయంలోని ధ్వజస్తంభానికి మకర లగ్నంలో గరుడధ్వజ పటాన్ని ఎగురవేసి కంకణభట్టాచార్యులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు.
బంగారు వాకిలిలో ఉత్సవ మూర్తులను విశేష సమర్పణను గావించారు. అనంతరం ఉభయ నాంచారి సమేతుడైన మలయప్ప బంగారు తిరుచ్చిలో అనంత, గరుడ, విష్వక్సేన, సుదర్శన, పరివార దేవతలతో గరుడధ్వజ పట సహితంగా తిరువీధి ప్రదక్షిణ ముందుకు సాగింది. సత్యస్వరూపుడైన తిరువేంకటాధీశుడు తన వైభవాన్ని, ప్రాభవాన్ని భక్తజనకోటికి చాటే విధంగా తిరువీధి ప్రదక్షిణ సాగింది. మాడవీధులు ప్రదక్షిణగా ఉత్సవరులు ఆలయంలోకి చేరుకున్న అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఆలయంలో స్వామివారి సమక్షంలో వర్ణకాంతులతో అలరారే ధ్వజ స్తంభంలో ఆవిర్భవించిన గరుడాళ్వార్ షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం మకర లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కంకణ భట్టాచార్యులు, సుందరవరద భట్టాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఏవీ.రమణదీక్షితులు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. ఈ కార్యక్రమానంతరం ఆలయ తిరుమలరాయ మండపంలో ప్రత్యేక ఆస్థానాన్ని నిర్వహించి స్వామివారికి నివేదనలు సమర్పించారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ర్డెడి తొలిసారిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గరుడోత్సవం రోజున రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ళుగా ధ్వజారోహణం రోజునే పట్టువస్ర్తాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మాగంటిబాబు, గల్లా అరుణకుమారి, రత్నాకర్‌రావు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, టీటీడీ పాలక మండలి సభ్యులు ఇందిర, చదలవాడ సుధ, టీటీడీ ఈవో కెవి.రమణాచారి, కలెక్టర్ ఎస్‌ఎస్ రావత్, ఎస్పీ శశిధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
|