దేవ దేవునిగా ప్రసిద్ధి గాంచిన కలియుగ దైవం తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా.. రెండో రోజైన ఆదివారం ఉదయం చిన్న శేష వాహన సేవ నయనాందకరంగా సాగింది. ఈ ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు పాల్గొని తమ ఇష్ట దైవమైన కలియుగ శ్రీనివాసుడుని దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వరుని దివ్యధామమైన తిరుమల గిరుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు శనివారం నుంచి ప్రారభమైన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా.. రెండో రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు చిన్నశేష వాహనం ఊరేగింపు జరిగింది.
అనంతరం సాయంత్రం మలయప్ప స్వామి హంస వాహనంపై ఊరేగుతారు. దీనికంటే ముందుగా ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అనంతరం వాహన మండపం వరకు స్వామి వారిని తీసుకెళ్ళతారు. అనంతరం అక్కడ నుంచి హంస వాహనంపై దేవ దేవుడు నాలుగు వేదాలకు ప్రతీక అయిన నాలుగు మాడ వీధుల్లో ఊరేగి, భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఇస్తారు. హంస సేవ.. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది.
|