శ్రీ శ్వీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం ఉదయం స్వామివారు మురళీ కృష్ణుడై చిన్నశేష వాహనంపై ఊరేగి భక్తులను కనువిందు చేశారు. మహావిష్ణువుకు శయ్యగా, గొడుగుగా, పాదుకలుగా వివిధ రూపాలలో సేవలందించిన శేషుడు స్వామివారి దాసగణంలో ప్రథముడు. అందుకు ప్రతీకగా ఉత్సవాలలో వాహనసేవలు పెద్దశేష వాహనంతో ప్రారంభమవుతాయి.
స్వామివారు రెండవ రోజు ఉదయం సైతం శేషవాహనంపై ఊరేగడం ఇష్టుడైన శేషుడిపై స్వామికి ఉన్న మక్కువకు ప్రతీతిగా చెప్పుకుంటారు. శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామి మురళీధరుడై చిన్నశేష వాహనాన్ని అధిరోహించి నాలుగు మాడవీధుల్లో భక్తజన కోటికి దర్శనమిచ్చాడు. ఉదయం మలయప్పస్వామికి రంగనాయక మండపంలో విశేష సమర్పణ గావించారు.
అనంతరం ఊరేగింపుగా వాహన మండపానికి వచ్చిన ఉత్సవరులు శేషవాహనంపై మాడవీధుల ప్రదక్షిణకు బయలుదేరారు. చక్రవర్తి లాంఛనాలకు ప్రతీకలైన ఆవు, ఏనుగు, గుర్రం తదితర దళాలు ముందుకు సాగుతుండగా బ్రహ్మరథం అగ్రభాగాన సారథ్యం వహించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనులు సంకీర్తనలు, భజనలు, కోలాట నృత్యాలు తదితరాలతో స్వామివారిని కీర్తించి సేవించారు.
భక్తులు నాలుగు మాడవీధులలో కూర్చొని స్వామివారి చిన్నశేష వాహన సేవను ఆద్యంతం తిలకించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంగటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు గట్టి నిఘా కల్పించిన విషయం తెల్సిందే.
|