శౌనికాదిమునులకు విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతము, చంద్రుని చూచినచో కలిగే దోషం మరియు దోష నివారణను సూతమహాముని చెప్పడం మొదలు పెట్టాడు. పూర్వం ఏనుగు రూపంలోని ఒక రాక్షసుడు పరమశివునికై ఘోరంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రసన్నడైన శివుడు రాక్షసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. శివుని చూసి పరమానందభరితుడైన ఆ రాక్షసుడు భక్త సులభా నీవు ఎల్లప్పుడూ నా కడుపులో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరాడు.
శివుడు తథాస్తు అన్నాడు. ఈ సంగతి తెలియని పార్వతి, భర్త జాడ తెలియక మహావిష్ణువుకు మొరపెట్టుకుంది. పార్వతి వేదనను తీర్చుటకై గజాసురుని కడుపులోని శివునికి విముక్తి కలిగించేందుకు నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలతో పాటు తాను కూడా గంగిరెద్దులాడించే వారి వేషములో బయలుదేరి గజాసురపురంలో ఆడసాగారు. తన భవనములో ఆడవలసిందిగా గజాసురుడు కోర్కెను మన్నించి మారువేషములోని తమ ఆటపాటలతో గజాసురుని రంజింపచేసారు.
వారి ఆటపాటలకు సంతృప్తి చెందిన గజాసురుడు ఏదైనా వరము కోరుకొనమని వారిని అడిగాడు. గంగిరెద్దు రూపంలోని నంది తన యజమాని అయిన పరమశివుని వెదుకుతూ ఇక్కడకు వచ్చిందని, మీ కడుపులోని శివుని ఇప్పించమని శ్రీమహావిష్ణువు కోరాడు. దీంతో నివ్వెరపోయిన గజాసురుడు అంగీకరించడంతో, తన వాడి అయిన కొమ్ములతో నంది, గజాసురుని కడుపుని చీల్చడంతో వెలుపలికి వచ్చిన పరమశివుడు మహావిష్ణువునికి స్తోత్రాలతో స్తుతించాడు.
గజాసురుని కోరిక మేరకు అతని తలను సర్వ లోకాలు పూజించేందుకు, అతని చర్మాన్ని తాను ధరించేందుకు మహాశివుడు స్వీకరించాడు. దేవతలందరూ ఎవరి గృహాలకు వారు వెళ్ళగా నందిని అధిరోహించిన శివుడు కైలాసం దారి పట్టాడు. విఘ్నేశ్వరుని జననం శివుని రాకను తెలుసుకొని సంతోషించిన పార్వతి స్నానం చేసే సమయంలో నలుగు పిండితో ఒక పిల్లవాడిని సింహద్వారం వద్ద కాపలా ఉంచింది. అనంతరం స్నానం పూర్తి చేసిన పార్వతి అన్ని రకాల ఆభరణాలను, మేలైన వస్త్రాలను ధరించి భర్త రాకకై వేచి చూడసాగింది.
నందితో సహా సింహద్వారం దాటబోయిన శివుని నలుగు పిండి పిల్లవాడు అడ్డగించాడు. దీంతో పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ పిల్లవాడి కంఠమును ఛేదించి లోపలకు వెళ్ళాడు. లోపలికి వచ్చిన భర్తతో ఆనందంగా మాట్లాడుతున్న పార్వతి, మాటల మధ్యలో పిల్లవాని కంఠము ఛేదించిన సంగతిని తెలుసుకుని బాధపడుతుంది. పార్వతి బాధకు చింతించిన శివుడు, తాను తీసుకువచ్చిన గజాసురుని తలను ఆ పిల్లవానికి అతికించి, ప్రాణం పోసి "గజాననుడు" అని పేరు పెట్టాడు.
వారిరువురి ప్రేమాభిమానాలతో పెరుగుతూ, తల్లిదండ్రులను సేవిస్తూ, తిరగడం కోసం అనింద్యుడనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడు గజాననుడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. మహాబలవంతుడైన అతడు నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనకు నాయకుడైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. విఘ్నాధిపతిగా మారిన వైనం తాము చేసే కార్యాలకు ఆటంకాలు కలుగకుండా ఒక అధిపతిని నియమించవలసిందిగా దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని ప్రార్ధించారు.
|