పెద్దవాడిని కాబట్టి నాకు ఆ పదవిని ఇవ్వాలని గజాననుడు, కాదు కాదు నేనే పదవిని చేపడతానని కుమారస్వామి పోటీపడతారు. మీరిద్దరిలో ఎవరు మూడు లోకాలలో తిరగడంతో పాటు ఆయా లోకాలలోని పుణ్య తీర్థాలలో స్నానం చేసి వస్తారో వారికి విఘ్నాధిపతి పదవిని ఇస్తానని పరమశివుడు పరీక్ష పెడతాడు. వెంటనే నెమలిని అధిరోహించిన కుమారస్వామి విజయానికై బయలుదేరుతాడు. తండ్రి పరీక్షను విని నివ్వెరపోయిన గజాననుడు, నేను శక్తిలేనివాడనని తెలిసి కూడా ఇలాంటి పరీక్షను పెట్టటం భావ్యమా అని తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటాడు.
గజానుని పరిస్థితిని అర్థం చేసుకున్న శివుడు, అతనికి నారాయణ మంత్రమును ఉపదేశించడంతో, మంత్రమును మనఃపూర్వకముగా జపించిన గజాననుడు కైలాసంలో కదలకుండా కూర్చుంటాడు. ఇక విజయం సాధించడానికి బయలుదేరిన కుమారస్వామి ఎక్కడకు వెళ్ళినా సరే అక్కడ గజాననుడు కనపడుతున్నాడు. అన్నగారి గొప్పదనాన్ని తెలుసుకున్న కుమారస్వామి తన అపచారమును మన్నించవలసిందిగా పరమశివుని ప్రార్థిస్తాడు. విజయుడైన గజానుని భాద్రపద శుద్ధ చవితినాడు మహేశ్వరుడు విఘ్నాధిపతిగా నియమిస్తాడు.
ఆ రోజున యావత్‌ప్రపంచం విఘ్నేశ్వరుని భక్తితో పూజించి, కుడుములు తదితర పిండివంటలు, టెంకాయలు, తేనె, పాలు, అరటిపండ్లు, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించింది. సంతృప్తితో విఘ్నేశ్వరుడు వాటిని భుజించి, భుక్తాసయముతో కిందకు వంగలేని వాడై తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకుందామని ప్రయత్నిస్తున్న తీరును చూసిన శివుని తలలోని చంద్రుడు వికటాట్టహాసం చేస్తాడు. దిష్టి ప్రభావంతో గజానుని కడుపు విచ్ఛిన్నమై కుడుములన్నీ కింద పడతాయి. దాంతో అతడు మరణిస్తాడు. కుమారుని మరణాన్ని చూసిన పార్వతి చంద్రుని వంక చూసి తీవ్రమైన స్వరంతో "పాపాత్ముడా! నీ దిష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కనుక ఇకపై నిన్ను చూసినవారు పాపాత్ములై నిందలను ఎదుర్కుంటారు" అని శపించింది.
నిందల పాలైన మహర్షుల భార్యలు అదేసమయంలో యజ్ఞం చేస్తున్న సప్త మహర్షుల భార్యలు అగ్నికి ప్రదక్షిణ చేస్తున్నారు. వారిని చూసి మోహించిన అగ్ని, భయముతో క్షీణించసాగాడు. అది గమనించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, తానే మహర్షుల భార్యల రూపాన్ని పొంది భర్తకు సేవ చేయసాగింది. స్వాహాదేవి వైనాన్ని గుర్తించని మహర్షులు, అగ్నికి సేవ చేస్తున్నది తమ భార్యలేనని తలచి, వారిని వదిలివేస్తారు. పార్వతి శాపం పెట్టిన తరువాత చంద్రుని చూడటం వలన వారు నిందల పాలయ్యారు.
మునులు, దేవతలు, మహర్షుల భార్యల ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, సప్తమహర్షలకు వాస్తవం తెలిపి, వారికి నచ్చచెప్పడంతో వారు భార్యలను స్వీకరిస్తారు. అటు తరువాత కైలాసానికి వెళ్ళిన బ్రహ్మ విఘ్నేశ్వరుని బతికిస్తాడు. "నీ శాప ప్రభావంతో లోకాల్లన్నింటికి ముప్పు వాటిల్లింది. శాపము ఉపసంహరించుకో పార్వతి దేవీ!" అని దేవతలు ప్రార్ధించడంతో " ఏ రోజు నా కుమారుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ రోజు చంద్రుని చూడరాదు " అని తెలిపింది పార్వతి. సంతోషించిన బ్రహ్మ తదితర దేవతలు, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా సుఖంగా ఉండసాగారు.
|