ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > గణేష్ చతుర్థి
 
విఘ్నేశ్వర వ్రత కథ
WD PhotoWD
శ్రీకృష్ణుని నిందల పాలు చేసిన శమంతకమణి
ద్వాపర యుగంలో ద్వారకకు చేరుకుని శ్రీకృష్ణునితో మాట్లాడుతున్న నారదుడు " స్వామీ! సాయంత్రమైంది. పైగా ఈ రోజు విఘ్నేశ్వర చతుర్ధి. చంద్రుని చూడకూడదని పార్వతి శాపమిచ్చింది. కనుక ఇంటికి వెళతాను సెలవిప్పించండి" అని శాపము వెనుక సంగతిని శ్రీకృష్ణునికి వివరించాడు. ఆరోజు రాత్రి ఎవరూ చంద్రుని చూడకూడదని ద్వారకలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు. పాలంటే ఇష్టపడే శ్రీకృష్ణుడు ఆ రాత్రి పాలు తాగుదామని గోవుల దగ్గరుకు వెళ్ళి, పాలలో చందమామ నీడను చూస్తాడు.

"ఆహా! నేను ఎటువంటి నిందల పాల పడతానో కదా" అని అనుకుంటాడు. కొంతకాలానికి శ్రీకృష్ణుని ఇంటికి అతిథిగా వచ్చిన సత్రాజిత్తు, సూర్యుడు తనకు వరంగా ఇచ్చిన శ్యమంతక మణిని శ్రీకృష్ణునికి చూపిస్తాడు. మణిని చూసి ముచ్చట పడిన శ్రీకృష్ణుడు మణిని తనకు ఇవ్వవలసిందిగా కోరుతాడు. రోజుకు ఎనిమిది బారువులను ఇచ్చే ఈ మణిని ఎంతటి సన్నిహితులకైనా ఇచ్చే ప్రసక్తి లేదని సత్రాజిత్తు స్పష్టంగా చెపుతాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఒక రోజు శ్యమంతక మణిని మెడలో ధరించి వేటకని అడవికి పోతాడు.

ప్రసేనుని మెడలోని మణిని మాంసపు ముక్కగా భావించిన ఒక సింహం, ప్రసేనుని చంపి మణిని ఎత్తుకుపోతుంది. దారిలో సింహానికి ఎదురుపడిన ఒక ఎలుగుబంటి దానిని చంపి, మణిని తీసుకుపోయి తన కొండగుహలో ఉయ్యాలలో పడుకొని ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చెను. మణిని ఇవ్వలేదనే కారణంగా శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి మణిని దొంగలించుకపోయాడని సత్రాజిత్తు ప్రకటించాడు. చందమామ నీడ తాలూకూ ప్రభావమని భావించిన శ్రీకృష్ణుడు, అడవిలోకి వెళ్ళి ప్రసేనుని మృతదేహాన్ని కనుగొంటాడు.

సింహం కాలి గుర్తుల ఆధారంగా, ఎలుగుబంటి కాలి గుర్తుల ఆధారంగా కొండగుహకు చేరుకున్న కృష్ణుడు, ఉయ్యాలలో ని జాంబవతి చేతిలోని మణిని తీసుకుని
WD PhotoWD
వెనుదిరుగుతుండగా, జాంబవతి ఏడుపు మొదలుపెట్టింది. కూతురు ఏడుపు విని అక్కడకు చేరుకున్న జాంబవంతుడు, శ్రీకృష్ణునితో రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా 28 రోజులు పోరాడుతాడు. శ్రీకృష్ణుని జయించడం తనవల్లకాదని తెలుసుకున్న జాంబవంతుడు, శ్రీకృష్ణునిలో శ్రీరామచంద్రుని చూస్తాడు. త్రేతాయుగమున ఏదైనా వరము కోరుకోమ్మని శ్రీరాముడు అడిగినప్పుడు, తెలివితక్కువగా మీతో ద్వంద్వ యుద్ధము చేయాలని కోరుకొనగా, శ్రీరాముడు వరమొసగిన వైనాన్ని జాంబవంతుడు శ్రీకృష్ణునికి విన్నవించుకుంటాడు.


తన వరాన్ని ఈ రూపంలో తీర్చినందుకు శ్రీకృష్ణుని స్తుతిస్తాడు. తనపై వచ్చిన నిందను దూరం చేసుకోవడం కోసమే మణిని వెదుక్కుంటూ వచ్చానని శ్రీకృష్ణుడు, జాంబవంతునితో చెప్పిందే తడవుగా, మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇస్తాడు జాంబవంతుడు. ద్వారక చేరుకున్న శ్రీకృష్ణుడు జరిగిన సంగతిని ప్రజలందరికి తెలిపి, మణిని సత్రాజిత్తుకు అందచేస్తాడు. సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను కానుకాగా ఇస్తాడు. ఒక మంచి ముహూర్తంలో జాంబవతిని, సత్యభామను శ్రీకృష్ణుడు వివాహం చేసుకొనెను.

పెళ్ళికి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి " మీరు సమర్ధులు కాబట్టి నిందను తొలగించుకున్నారు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి" అని వేడుకొన్నారు. వారి మొరను ఆలకించిన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై " భాద్రపద శుద్ధ చవితినాడు పొరపాటున చంద్రుని చూసిన వారు, ఆ రోజు గణపతిని పూజించిన అనంతరం ఈ శ్యమంతకమణి కథను విని అక్షింతలు తలపై వేసుకునేవారికి ఎటువంటి నిందలు రావు" అని వరము ఇవ్వడంతో దేవతలు, మునులు సంతసించి శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు గణపతి పూజను చేసి సుఖముగా ఉండసాగారని శౌనకాది మునులకు తెలిపిన సూతమహాముని తన ఆశ్రమానికి వెడలిపోయాడు.
 << 1 | 2 | 3