బాలగణపతి రక్తవర్ణుడైన బాలగణపతికి నాలుగు చేతులుంటాయి. వాటిలో అరటి, మామిడి, పనస పండ్లు,చెరుకుగడలను ధరిస్తాడు. తొండంతో మోదకం పట్టుకుని ఉంటాడు.
తరుణ గణపతి రక్తవర్ణంలో ఉండే తరుణ గణపతికి ఎనిమిది చేతులుంటాయి. వెలగపండు, వరికంకులు, దంతం, అంకుశాలను కుడి చేతులలోనూ, కుడుము, నేరేడు పంట, చెరకుగడ, పాశాలను ఎడమచేతులలోనూ ధరించి ఉంటాడు.
భక్తగణపతి ఈ గణపతి వర్ణం తెలుపు. నాలుగు చేతులను కలిగి ఉంటాడు. కుడివైపు చేతులలో మామిడి, అరటి పండ్లను, ఎడమవైపు చేతులలో కొబ్బరికాయ, క్షీరాన్న పాత్రను ధరించి ఉంటాడు.
వీరగణపతి భీకరరూపుడై నిలబడి ఉండే ఈ గణపతికి పదహారు చేతులుంటాయి. వాటిలో ధనుస్సు, బాణం, చక్రం, త్రిశూలం, భేతాళం, పరశువు, ఖడ్గం, గద, పాశం ఉంటాయి. ఈ వీరి గణపతి రక్తవర్ణుడు.
శక్తిగణపతి సిందూర వర్ణంలో (జేగురురంగు) విలసిల్లే ఈ గణపతి వామకటిపైన దేవిని కూర్చోబెట్టుకుని నాలుగు చేతులతో ఉంటాడు. కుడిచేతిలో దంతం, అంకుశం, ఎడమ చేతిలో పాశం ధరించి ఉంటాడు. శక్తితో కలసి ఉండడంవల్ల ఈయన శక్తి గణపతి.
ద్విజగణపతి ఈ రూపంలో గణపతికి నాలుగు ముఖాలు. ఎడమచేతిలో కమండలం, తాళపత్ర గ్రంథాలు, కుడి చేతిలో జపమాల ఉంటాయి. నుదుటిపై మూడవనేత్రం బ్రహ్మజ్ఞాన సూచనగా ఉంటుంది. ఇలాంటి రూపురేఖలున్న గణపతికి బ్రహ్మగణపతి అనే పేరు కూడా ఉంది. తెల్లని వర్ణం కలవాడు ఈ గణపతి.
సిద్ధగణపతి ఈ గణపతి నాలుగు చేతులలో మామిడిపండు, గొడ్డలి, పూలగుత్తి, చెరకుగడలను ధరించి ఉంటాడు. తొండంతో నువ్వుల కుడుము పట్టుకుని ఉంటాడు. ఈయనకు ఇరువైపులా శ్రీదేవి, నమవృద్ధదేవిలు ఆశీనులై ఉంటారు. ఈయన లేత పసుపు వర్ణంలో ఉంటాడు.
ఉచ్చిష్టగణపతి నాలుగు చేతులతో కుడిచేతులో జపమాల, కలువపువ్వులతో, ఎడమచేతులలో వీణ, వరికంకులతో ఈ గణపతి ఉంటాడు. ఈయనది నీల వర్ణం.
విఘ్నగణపతి విఘ్నాలు కలుగకుండా కాపాడే ఈ వినాయకుడికి పదిభుజాలు. శంఖు, చక్రాలను ధరించి విష్టుమూర్తిని స్ఫురింపజేస్తాడు. చేతులలో చెరకుగడ, పాశం, దర్భలు, అంకుశం, దంతం ఉంటాయి. కుడిపాదం క్రిందికి చాచి ఉంటుంది. ఈ గణపతి బంగారు వర్ణంలో ఉంటాడు.
క్షిప్రగణపతి ఎర్రని శరీరకాంతి కలిగిన క్షిప్రగణపతికి నాలుగు చేతులుంటాయి. చేతులలో దంతం, అంకుశం, కల్పలత, పాశం ఉంటాయి. తొండంతో రత్నకలశాన్ని పట్టుకుని ఉంటాడు. ఈయన రంగు రక్తవర్ణం.
|