ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > గణేష్ చతుర్థి
 
బొజ్జ గణపయ్య రకాలు
హేరంబ గణపతి
ఈ రూపంలో గణపతి ఐదుతలలు, పది చేతులతో ఉంటాడు. నాలుగుతలలు నాలుగు దిక్కులకు ఉండగా, ఐదవ శిరస్సు ఆ నాలుగుతలలపై భాగంలో ఉంటుంది. సింహంపైన కూర్చుని శక్తి స్వరూపుడై ఉగ్రతను ప్రదర్శిస్తూ చేతులలో ఆయుధాలను కలిగి ఉంటాడు. ఈ గణపతి వర్ణం తెలుపు.

లక్ష్మీగణపతి
ఈ గణపతికి రెండువైపులా తొడలమీద శ్రీదేవి, భూదేవి కూర్చొని ఉంటారు. పది చేతులున్న ఈ గణపతి చిలుక, గద, ఖడ్గం, అంకుశం, పాశం అమృతకలశాలను ధరించి వరదహస్తాన్ని చూపిస్తూ ఉంటాడు. రెండు చేతులతో ఇరువైపులా ఉన్న అమ్మవార్లను ఆలింగనం చేసుకుని ఉంటాడు. కుడిపాదం కిందికి జారవిడిచి ఉంటుంది. ఈయన వర్ణం కూడా తెలుపే!

మహాగణపతి
ఈ గణపతి ఎడమ తొడపై అమ్మవారు ఉంటుంది. పది చేతులతో చక్రం, ఔషధి, సంచి, చెరకుగడ, పాశం, పద్మం, గద ఉంటాయి. ఈయన రక్తవర్ణుడు.

విజయగణపతి
నాలుగు చేతులతో ఏకదంతం, అంకుశం, మామిడి పండు, పాశాలను ధరించి ఈ గణపతి ప్రసన్న వదనంతో ఉంటాడు. ఈయనదీ రక్తవర్ణమే!

నృత్యగణపతి
నాలుగు చేతులతో, పాశం, పరుశువు, దండం, ఆయుధాలను ధరించి, ఎడమకాలు పైకెత్తి నృత్య భంగిమలో ఉంటాడు. ఈయనది పచ్చని వర్ణం.

ఊర్థ్వగణపతి
ఎనిమిది చేతులున్న ఈ గణపతి బాణం, దంతం, వరికంకి, ఎర్రకలువ, చెరుకు, గద, పద్మాలను ధరించి ఉంటాడు. ఈయనది బంగారపు ఛాయ.

ఏకాక్షరగణపతి
పద్మంపై ఆశీనుడై ఉండే ఏకాక్షర గణపతి నాలుగు చేతులలో అంకుశం, దంతం, పాశం, వరదముద్రలతో ఉంటాడు. ఈ గణపతికి మూడవ కన్ను ఉంటుంది. శిరస్సుమీద నెలవంక ఉంటుంది. ఈయనదీ రక్తవర్ణం.

వరగణపతి
ఈ గణపతి కూడా శిరస్సు మీద నెలవంకను ధరించి ఉంటాడు. మూడవకన్ను ఉంటుంది. నాలుగు చేతులలో కపాలం, అంకుశం, పాశం ఉంటాయి. ఎడమతొడ మీద పుష్పిదేవిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఈయనదీ రక్తవర్ణమే!

త్ర్యక్షరగణపతి
తొండంతో ఉండ్రాళ్ళను పట్టుకుని కనిపించే ఈ గణపతికి నాలుగు చేతులు. వాటిలో అంకుశం, దంతం, మామిడి పండు, పాశాలను ధరించి ఉంటాడు. ఈయనది బంగారు రంగు.

క్షిప్రప్రసాదగణపతి
తామర పువ్వులో ఆశీనుడైన ఈ గణపతినే ``క్షిప్రగణపతి`` అని కూడా పిలుస్తారు. నాలుగు చేతులతో దండం, అంకుశం, కల్పలత, పాశం ధరించి ఉంటాడు. శిరస్సు మీద నెలవంక ఉంటుంది. ఈయనది రక్తవర్ణం.
 << 1 | 2 | 3  >> 
మరిన్ని
షోడశ గణపతుల ధ్యానాలు
జయ విఘ్నేశ్వర
శ్రీ గణేశవ్రతములు
చతురావృత్తి తర్పణం
పత్రిలో పరమార్థం
అనేక వాహనుడు