|
బొజ్జ గణపయ్య రకాలు
|
|
|
|
శుక్రవారం, 14 సెప్టెంబర్ 2007( 15:22 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
|
హరిద్రాగణపతి ఈ వినాయక మూర్తినే మనం సాధారణంగా వినాయక చవితినాడు పూజిస్తాం. నాలుగు చేతులలో దంతం, పాశం, అంకుశం, కుడుములను ధరించి ఉంటాడు. శుభకార్య సమయాల్లో పసుపుతో చేసి పూజ చేసే మూర్తి కూడా ఈయనే. ఈయన పసుపు రంగులో ఉంటాడు.
ఏకదంతగణపతి నాలుగు చేతులున్న ఈ గణపతి, వాటిలో దంతం, జపమాల, లడ్డు, గొడ్డలి ధరించి ఉంటాడు. పెద్ద పొట్టతో నలుపు రంగులో ఉంటాడు.
సృష్టిగణపతి సృష్టి చేయటంలో సమర్థుడిగా పేర్కొన్న ఈ గణపతి నాలుగు చేతులతో దంతం, అంకుశం, పాశం, మామిడి పండులను ధరించి ఉంటాడు. ఈయన వర్ణం రక్త వర్ణం!
ఉద్ధండగణపతి ఈ గణపతి పన్నెండు చేతులతో ఉంటాడు. దంతం, దానిమ్మపండు, పువ్వు, పద్మం, వరికంకి, అంకుశాలను కుడిచేతులలోనూ, చెరకు, గద, రత్నకలశం, నల్లకలువ పువ్వు, చంద్రుడు, పాశాలను ఎడమచేతులలోనూ ధరించి ఉంటాడు. ఎడమ తొడపై దేవిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఈయన రక్త వర్ణుడు.
ఋణవిమోచకగణపతి నాలుగు చేతులతో, దంతం, అంకుశం, నేరేడు పండు, పాశాలతో ఉంటాడు. ఈయన ఋణ విమోచన కలిగిస్తాడని నమ్మకం. తెల్లని రంగు కలవాడు.
డుండిగణపతి చతుర్భుజుడైన ఈ గణపతి అమృతకలశం, జపమాల, శక్తి, పరశువులను కలిగి ఉంటాడు. ఈయన వర్ణమూ - రక్త వర్ణమే!
ద్విముఖగణపతి రెండు ముఖములతో, ఒకే కిరీటంతో, నాలుగు చేతులతో, ఈ గణపతి ఉంటాడు. వాటిలో దంతం, అంకుశం, రత్న పాత్ర, పాశాలను ధరించి ఉంటాడు. ఇంద్రనీల వర్ణంలో ఉంటాడు.
త్రిముఖగణపతి మూడు ముఖాలతో, ఆరు చేతులతో అమృతకలశం, పాశాంకుశాలు, జపమాలలను ధరించి అభయహస్తాన్నిస్తూ కనిపించే ఈ గణపతి పద్మంమీద కూర్చొని ఉంటాడు. రక్త వర్ణంలో ఉంటాడు.
సింహగణపతి తొండంతోపాటు సింహముఖం కలిగినవాడు కనుక ఈయన సింహ గణపతి. ఎనిమిది చేతులతో, పూలు, అభయముద్ర, రత్నపాత్ర, చక్రం, వరదముద్ర, కల్పలత, వీణ, తామర పువ్వులను ధరించి ఉంటాడు. ఈయనది తెలుపు రంగు.
యోగగణపతి బ్రహ్మజ్ఞానానికి, యోగతత్వానికి చిహ్నమైన ఈ గణపతి పెద్ద కిరీటం ధరించి నాలుగు చేతులలో యోగదండం, జపమాల, పాశం, చెరుకుగడలను కలిగి జపముద్రలో ఉంటాడు. ఈయన రక్తవర్ణుడు.
వల్లభగణపతి ఎడమతొడపై ``వల్లభదేవి`` కూర్చుని ఉండటంవల్ల ఈయనకు ``వల్లభగణపతి`` అని పేరు వచ్చింది. పది చేతులను కలిగి చక్రం, శంఖు, కలువపువ్వు, వరికంకి, పాశం, చెరుకు, దానిమ్మ పండు, అమృత కలశం, దంతం, పద్మాలను వాటిలో ధరించి ఉంటాడు. ఈయన వర్ణమూ రక్తవర్ణమే!
సిద్ధి, బుద్థిగణపతి వినాయకుడి భార్యలని పేర్కొనే సిద్ధి, బుద్థి వినాయకుడి కుడి, ఎడమవైపు ఉండటంవల్ల ఈయనకు ఈ పేరు వచ్చింది. ఈయనది పచ్చని రంగు.
|
|
|
|
|