ఒక పక్క వీధుల్లో అక్కడక్కడా టపాసులు మోగుతుండగా దీపావళి అమావాస్యకు మూడు రోజుల ముందు కవితల పోటీ మొదలయ్యింది. మంత్రిగారు వస్తున్నారనేసరికి కార్యక్రమానికి అటు స్పాన్సర్లను, ఇటు ప్రేక్షకులను మా కాళుడు బాగానే సంపాదించుకున్నాడు. సభ కళకళలాడి పోతున్నది. పోటీదారులు కవితా గానం సాగిస్తున్నారు. నాతో పాటు జడ్జిలుగా వచ్చిన మిగిలిన ఇద్దరు ఎదురుగా ఉన్న కాగితాల మీద ఏదో రాస్తున్నట్లు నటిస్తున్నారు. మా నటనకు జీవం పోస్తూ మధ్య మధ్యలో కాళుడు మా దగ్గరకు వచ్చి మాట్లాడి పోతున్నాడు. మంత్రి గారి కుమార్తె కవితాగానం విని మా మతి పోయింది. నా జీవితంలో అంత ఘోరమైన కవితను నేనెప్పుడు వినలేదు. పోటీలు ముగిసాయి. ఉత్తమంగా కవితాగానం చేసిన అభ్యర్థిగా తన కుమార్తె వరదాయినికి మంత్రిగారు బహుమతిని ఇవ్వగానే హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది. మన కాళునిలోని కవిరాజ పోషకుని ప్రశంసిస్తూ మంత్రిగారు ప్రసగించడం... అంతా కలలా జరిగిపోయింది. పోటీలో పాల్గొన్న వారందరికి టపాకాయల పెట్టెలను కాళుని ఆధ్వర్యంలో మంత్రిగారు అందించారు. అలా మొదలైంది కాళుని కవితా ప్రస్థానం... చిక్కడిపల్లిలో మొదలైన మా వాడి కళాసేవ ఇప్పుడు ఖండాంతరాలకు చేరుకుంటున్నది. అందుకే నేనంటాను.... మా కాళునికి అమావాస్య కలిసొచ్చిందని... మరి మీరేమంటారు?!
|