భారత స్వాతంత్ర్య 60వ వార్షికోత్సవాల సందర్భంగా.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో స్వేఛ్ఛా భారతావని కోసం ఎందరో మహనీయులు పాటుపడ్డారు. అలాంటి వారిలో వీరపాండ్య కట్టబొమ్మన్ అగ్రగణ్యుడు. భారత స్వాతంత్ర్య పోరాటానికి ముందే.. తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన త్యాగవీరుడు. ఆయన తర్వాత చెప్పుకోదగిన స్వాతంత్ర్య సమరయోధుల్లో వీవో.చిదంబనార్, విశ్వనాథ దాస్, తిరుప్పూర్ కుమరన్, మహాకవి భారతీయార్ ఇలా... ఎందరో ప్రముఖులు ఉన్నారు. వారిలో కొంతమందిని ఈ షష్టిపూర్తి స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా స్మరించుకుందాం. వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
వీరపాండ్య కట్టబొమ్మన్... "ఎందుకు కట్టాలిరా నీకు శిస్తూ... నారు పోశావా.. నీరు పోశావా.."అంటూ తెల్లవారిని నిలదీశిన యోధుడు. శిస్తుకోసం వచ్చిన ఈస్టు ఇండియా కంపెనీ వారిని ఎదిరించాడు. దీంతో.. పాంచాలకురిచ్చి కోటను పాలిస్తున్న వీరపాండ్య కట్టబొమ్మన్‌పై ఆంగ్లేయ సైనికులు దాడి చేశారు. ఆంగ్లేయుల సైనిక బలం ముందు కట్టబొమ్మన్ సైన్యం తలవంచక తప్పలేదు. దీంతో వారికి చిక్కకుండా తప్పించుకున్న కట్టబొమ్మను చివరకు.. పుదుక్కోట్టై వద్ద పట్టుకున్న తెల్లదొరలు ఉరితీశారు. ఇలా.. స్వాతంత్ర్య పోరాటినికి ముందే..అశువులు బాసిన వీరుడిగా కట్టబొమ్మన్ చరిత్రలో నిలిచిపోయాడు.
విశ్వనాథదాస్.. "తెల్లకొంగ ఎగురుతోంది పాప... (కొక్కు పరక్కుదడి పాప్పా)" అంటూ ఆయన పాడిన గేయం యావత్ తమిళులను ఉర్రూతలూగించింది. సేచ్చా భారతికి కంకణబద్దులను చేసింది. నాటకాల ద్వారా ఆయన స్వాతంత్య్ర జ్వాలలను ప్రజల్లో రగిలించారు. 1919 జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనను గేయాల ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించి వారిలో ఆంగ్లేయిలపై వ్యతిరేక జ్వాలలు రగిలించారు. బ్రిటిషు వారు ఆయన నాటకాలపై నిషేధం విధించి ఆయన్ను జైల్లో పెట్టంది.
వీఓ చిదంబరనార్.. "కప్పల్ ఓట్టియ తమిళన్" (పడవ నడిపిన తమిళుడు)గా ఖ్యాతి పేరుగాంచిన భారత మాత ముద్దుబిడ్డ. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి 1906లో స్వదేశీ నౌకయాన సంస్థను నెలకొల్పారు. పరాయి పాలన కష్టనష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. 1908లో తిరునెల్వీలిలో దేశాభిమాన సంఘాన్ని స్థాపించారు. బ్రిటీషు వారు ఆయన్ను అరెస్టు చేసి 40 ఏళ్లపాటు కారాగారంలో బంధించి కఠినంగా శిక్షించారు. జైల్లో చిత్రహింసలకు గురైన చిదంబరనార్ చివరకు జైల్లోనే తుదిశ్వాస విడిచారు.
|