భారత క్రికెట్ జట్టుకు కాగితంపై పులి... మైదానంలో పిల్లి అనే అపవాదు వుంది. ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్యాటింగ్ లైనప్ "టీమ్ ఇండియా" సొంతం. అయితే.. మైదానంలో దిగితే ప్రత్యర్థి బౌలింగ్‌కు దాసోహం కావడం మైనస్ పాయింట్. ఆది నుంచి ఈ బలహీనతను అధిగమించేందుకు భారత జట్టు ఎంతో కృషి చేస్తోంది... చేస్తూనే వుంది. అయితే.. అది ఎండమావిగానే మిగిలిపోతోంది. అలాగే.. 2007 సంవత్సరం భారత జట్టుకు కొంత చేదు, కొంత తీపి గుర్తులను మిగిల్చింది. ఏడాది కాలంలో భారత జట్టు ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఒక సారి అవలోకనం చేస్తే...
ఈ ఏడాది ఆరంభంలో తొమ్మిదో ప్రపంచ కప్ జరిగింది. తొమ్మిది దీవుల సమ్మేళనమైన వెస్టిండీస్ ద్వీపకల్పంలో జరిగిన ఈ ప్రపంచ కప్‌లో "టీమ్ ఇండియా" ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన "ట్వంటీ-20" ప్రపంచకప్‌లో జార్ఖండ్ డైనమెట్ ధోనీ నేతృత్వంలోని "ధోనీ యువసేన" ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. ఇలా ఆరంభమైన "టీమ్ ఇండియా" ప్రస్థానం... 2007 సంవత్సరంలో నాటకీయ పరిణామాల మధ్య మీడియాకు మంచి సమాచారాన్ని అందించే సరుకుగా వాసికెక్కింది.
ప్రపంచ కప్ ఘోర పరాజయం అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటన నుంచి అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు ఆ తర్వాత టొరంటో గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలోను మంచి ప్రతిభను కనపరిచారు. ఈ ఫ్యూచర్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఖంగుతినిపించిన టీమ్ ఇండియా, కప్‌ను ఎగురేసుకుంది. ఆ తర్వాత అటునుంచి ఇంగ్లాండ్ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్యటనలో ద్రావిడ్ సేన తొలి సారిగా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అటుపిమ్మట జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో సీనియర్లు బరిలో లేకున్నా యువసేన మాత్రం విశ్వవిజేతగా మాతృభూమిపై కాలుమోపింది. ఆ సమయంలో యువసేనకు లభించిన స్వాగతం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. అనంతరం సొంత గడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా.. వన్డే సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది.
|