ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)కి, ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) రూపేణా పోటీ ఎదురైంది. టీమ్ ఇండియాకు కొత్త కోచ్‌ను సమకూర్చుకోవడంలో అనేక వైఫల్యాలు, ఆటగాళ్లపై వివాదాస్పదమైన ఆంక్షలు, సెలక్టర్లు కథనాలు రాయకూడదంటూ పాత నిబంధనలకు కొత్త శక్తిని నింపే క్రమంలో బీసీసీఐ ఈ ఏటి వార్తల్లో మేటిగా నిలిచింది.
వ్యక్తిగత విజయాలను అవలోకించినట్లయితే బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచే మొదటి డబుల్ సెంచరీని చేసి సీనియర్లలో చేవ తగ్గలేదని క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ పగ్గాలను వీడగా, మహేంద్ర సింగ్ ధోని వన్డే నాయకత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. అదే క్రమంలో "వికెట్ జంబో"గా అభిమానులు పిలుచుకునే అనిల్ కుంబ్లేను టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ వరించింది. బీసీసీఐ సుధీర్ఘ కాలం జరిపిన అన్వేషణ ఫలితంగా టీమ్ ఇండియా కోచ్‌గా దక్షిణాఫ్రికా ఓపెనర్ గ్యారీ కిరిస్టెన్ నియమించబడ్డాడు.
తాము ఇంకా సంపూర్ణమైన ఫిట్‌నెస్‌తో ఉన్నామని సీనియర్ ఆటగాళ్ళు నిరూపించుకున్న తరుణంలోనే, సీనియర్లతో సమంగా తాము ఆడగలమనే ధీమాను యువ ఆటగాళ్ళు కనపరిచిన వైనానికి 2007 సంవత్సరం తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాక సత్తాను చూపే ఎందరో కుర్రకారుకు ఈ సంవత్సరం స్వాగతం పలకడం ద్వారా సత్ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
|