గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దర్శకుల హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అగ్రహీరోలు సినిమాల్లో ముగ్గురుకి మినహా ఎవరికీ సరైన సక్సెస్‌లు లేవు. గత ఏడాది 'పోకిరి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మహేష్ బాబుకు 'అతిథి'నిరాశ మిగిల్చింది. 'దేశముదురు'తో ఈ ఏడాది సినిమా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అగ్రహీరోలుగా పిలవబడే మెగాస్టార్ చిరంజీవి 'శంకర్‌దాదా జిందాబాద్' బాగా మైనస్ అయ్యింది. వరుసగా రెండేళ్ల నుంచి సక్సెస్ లేని నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది కూడా 'మహారథి' పెద్ద ప్లాప్ ఇచ్చింది. 'చంద్రముఖి' వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు పి.వాసు చేసిన భగీరథ ప్రయత్నం కూడా గంగపాలైంది.
ఇక రాఘవ లారెన్స్ 'మాస్'తో నాగార్జునకు హిట్ ఇచ్చి ఈ ఏడాది చివర్లో 'డాన్'గా చూపబోయి ఢాం అనిపించాడు. వెంకటేష్‌కు 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'తులసి' వంటి రెండు హిట్లను తన ఖాతాలో జమచేసుకున్నాడు. సంక్రాంతికి తల్లి సెంటిమెంట్‌తో ముఖ్యమంత్రి వైఎస్ బావమరుదులు ప్రభాస్‌ను హీరోగా పెట్టి తీసిన 'యోగి' చిత్రం అడ్రస్ లేకుండా పోయింది. రెండేళ్లుగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' చిత్రాలతో హిట్లు కొట్టిన సిద్దార్థతో ఎంఎస్ రాజు 'ఆట' అంతంత మాత్రంగానే ఆడింది.
ఇక యువ అగ్రహీరోలు ఎన్టీఆర్ నిజంగా 'యమదొంగ'తో సక్సెస్ సాధించాడు. కానీ అందులో తన అదనపు కండల్ని కరిగించుకుని కొత్తగా కన్పించేందుకు నానా తంటాలు పడ్డాడు. 'ఆనంద్', 'గోదావరి' చిత్రాల తర్వాత అంతా కొత్తవారితో శేఖర్ కమ్ముల పాత ఫార్ములానే ఉపయోగించి తీసిన 'హ్యాపీడేస్' చిత్రం కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీకే హ్యాపీరోజులు వచ్చాయని నిరూపించాడు.
ఆ దెబ్బతో అగ్రహీరోలు సైతం తాము చేయడానికి సిద్ధమంటూ శేఖర్ కమ్ములకు వర్తమానాలు పంపారు. అనుకోకుండా ఒక రోజు ఓ మోస్తరుగా ఆడినా ఆ తర్వాత సరైన కమర్షియల్ చిత్రాల సక్సెస్‌ల కోసం కష్టాలు పడుతున్న ఛార్మీకి తాను వేసిన మంత్రం ఫలించింది. సాఫ్ట్‌వేర్ రంగంలో నుంచి సినిమాసరంగంలోకి వచ్చిన కుర్రాళ్లు మంత్ర సినిమాను సరదాగా తీసి చక్కని సక్సెస్ సాధించారు.
ఇక ఈ ఏడాది 88 స్ట్రెయిట్ చిత్రాలు విడుదలైతే వాటికి అటూఇటూగా సమాన స్థాయిలో డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇంక ఈ ఏడాదిలో నాలుగా సినిమాలు డబ్బింగ్ చిత్రాలు విడుదల కాగా.. వాటిల్లో రజనీకాంత్ శివాజీ మినహా ఏ చిత్రానికి సరైన గుర్తింపు లేకుండా పోయింది. ఈ సారి డబ్బింగ్ హీరో విశాల్ భరణి, భయ్యా చిత్రాలతో ముందుకు వచ్చినా ప్రేక్షకులు బైబై చెప్పారు. అందుకే లాభం లేదనుకుని స్ట్రెయిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు సెల్యూట్ అంటూ త్వరలో రానున్నాడు. అది వచ్చే ఏడాదికి పూర్తవుతుంది. గతంలో సూర్య గజినికి వచ్చిన పేరు ఈ ఏడాది దేవా చిత్రానికి రాలేదు.
|